మురుగదాస్ నుంచి మరో సైన్స్ ఫిక్షన్ .. హీరోగా అల్లు అర్జున్!

Update: 2021-10-02 05:31 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా కథలు కంటున్నారు. ఆ తరహా కథలు పట్టుకుని వస్తేనే కదులుతున్నారు. ఏ కథను ఎంచుకున్నా అది అన్ని భాషల వారికీ .. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేదిగా ఉండాలి. కథ అందరికీ వర్తించేదై ఉండాలి .. కథా పరిధి ఎక్కువగా ఉండాలి .. బహుముఖాల్లో భారీతనం కనిపించాలి. అలా అనిపించాలంటే ఆయా భాషలకి చెందిన స్టార్లు ఆ సినిమాల్లో ఉండాలి. ఇలా తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా తన రూపురేఖలను మార్చుకుంటూ వెళుతోంది. ఆ వేగాన్ని అందుకోవడానికి స్టార్ హీరోలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కొంతమంది దర్శక నిర్మాతలు జానపదాల్లోని .. పౌరాణికాల్లోని పాయింటును పట్టుకుని, పాన్ ఇండియా సినిమాగా చెక్కుతూ ఉంటే, మరి కొంతమంది తమకి దొరికిన కథను ఆ స్థాయిలో మలుస్తున్నారు. ఇప్పుడు తెరపై ఎలాంటి అద్భుతమైన దృశ్యాలనైనా ఆవిష్కరించవచ్చు. అంతలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అందువలన ఫిక్షన్ సినిమాలకు తగిన కథలను కూడా రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్ అలాంటి ఒక కథనే సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు.

తమిళంలో ఒకప్పుడు ఈ హీరోను ఇలాగే చూపించాలి .. ఆ కథను అలాగే చెప్పాలి అనే ఒక మూస ధోరణి కనిపించేది. అలాంటి కథలు మన దగ్గర ఉడకవ్ అన్నట్టుగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చిన దర్శకుడిగా మురుగదాస్ కనిపిస్తాడు.

చూడటానికి రాముడు మంచి బాలుడిలా అనిపిస్తాడు. కానీ తెరపై హీరోలతో ఆయన చేయించే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. తమిళ సినిమాల పోకడను మార్చేయడమే కాదు, ఇతర భాషా చిత్రపరిశ్రమల దృష్టిని సైతం ఆయన ఆకర్షించాడు. హిందీ నుంచి ఆమిర్ ఖాన్ పిలిచి 'గజిని' .. తెలుగు నుంచి చిరంజీవి పిలిపించి 'స్టాలిన్' చేయించారంటే ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి మురుగదాస్ .. అల్లు అర్జున్ కి ఒక కథ వినిపించాడనీ, ఆ కథపై తరచూ చర్చలు జరుగుతున్నాయనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. 'పుష్ప' తరువాత అల్లు అర్జున్ చేయనున్న సినిమా కూడా ఇదేననే టాక్ వచ్చింది. అలా అందరూ చెప్పుకుంటున్న ఆ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే ఉందట. ఇది కథ ఫిక్షన్ జోనర్ కి సంబంధించినది కావడమే ఆలస్యానికి కారణమని అంటున్నారు. గతంలో మురుగదాస్ చేసిన '7th సెన్స్' తరహాలో ఈ సైన్స్ ఫిక్షన్ ఉంటుందనే టాక్ బయటికి రావడం ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ ఫిక్షనల్ సినిమాలో అల్లు అర్జున్ ను ఆయన చాలా డిఫరెంట్ గా చూపించనున్నాడని అంటున్నారు. ఫిక్షనల్ పాత్రలో తెరపై ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆశ్చర్య చకితులను చేసేలా ఉంటాయని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయి లక్షణాలు ఈ కథలో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు ఎప్పుడు పూర్తవుతుందో .. ఎప్పుడు ఎనౌన్సమెంట్ వస్తుందో చూడాలి.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.ఆ తరువాత సినిమాను ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' టైటిల్ తో చేయనున్నాడు. ఈ కథకు కూడా పాన్ ఇండియా లక్షణాలు ఉండేలా చూసుకుంటున్నారు. 'పుష్ప' ఫస్టు పార్టుకు .. సెకండు పార్టుకు మధ్య బన్నీ ఈ సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ తరువాత మురుగదాస్ ప్రాజెక్టు ఉంటుందనే విషయం అర్థమవుతోంది. 
Tags:    

Similar News