జాతీయ అవార్డులపై మురుగదాస్ మళ్లీ..

Update: 2017-04-15 11:10 GMT
జాతీయ అవార్డులు ప్రకటించి రెండు వారాలు అవుతున్నా.. ఇంకా వాటి మీద చెలరేగిన రగడ ఇంకా చల్లారనే లేదు. పోటీలో ఇంకా బెటర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ తన మిత్రుడైన అక్షయ్ కుమార్ కు ప్రియదర్శన్ అప్పనంగా ఉత్తమ నటుడి అవార్డు కట్టబెట్టేశాడంటూ విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై మురుగదాస్ లాంటి ప్రముఖ దర్శకుడు నేరుగా ధ్వజమెత్తేశాడు. జ్యూరీ పక్షపాతంతో వ్యవహరించిందని విమర్శలు గుప్పించాడు. నిజానికి మురుగదాస్ సినిమా ఏదీ పోటీలో లేకున్నా అతను విమర్శలు గుప్పించేసరికి ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన మీద వస్తున్న విమర్శలకు ప్రియదర్శన్ దీటుగా స్పందిస్తూ.. మురుగదాస్ ను ఉద్దేశించి ‘గో టు హెల్’ అన్న సంగతి తెలిసిందే.

ఐతే మురుగదాస్ ఆ తర్వాత కూడా తగ్గలేదు. మళ్లీ ట్విట్టర్ వేదికగా జ్యూరీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఇప్పుడు వాదన అనవసరమని.. నిజాలు మాట్లాడమని కౌంటర్ ఇచ్చాడు. ‘‘మిస్టర్ జ్యూరీ. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాదించడం కన్నా.. నిజాన్ని బయటకు తీస్తే బెటర్’’ అని ట్వీట్ చేశాడు మురుగదాస్. మరి ఈ వ్యాఖ్యలకు ప్రియదర్శన్ ఏమంటాడో చూడాలి. అక్షయ్ కుమార్ మంచి నటుడే అయినా.. ‘రుస్తుం’లో అతను బాగానే నటించినా.. ‘దంగల్’ సినిమాకు అమీర్ ఖాన్ లేదా ‘అలీగఢ్’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపిక కావాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News