హాట్ టాపిక్ అయిన కీరవాణి వ్యాఖ్యలు

Update: 2019-12-30 08:02 GMT
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయులు సింహా హీరోగా.. కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం 'మత్తు వదలరా' ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిస్మస్ నాడు విడుదలయిన ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో 'మత్తు వదలరా' టీమ్ ఒక మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ కు హాజరైన కీరవాణి తనదైన శైలిలో టాలీవుడ్ పోకడలపై రెండు చెణుకులు విసిరారు.

స్టేజ్  పైకి వచ్చి మైక్ అందుకున్న కీరవాణి పిలవకుండానే ఇలా స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడడం తనకు అలవాటేనని.. గతంలో ఒకసారి ఇలానే జరిగిందని.. ఇది రెండవసారి అని చమత్కరించారు. ఇక 'మత్తు వదలరా' నిర్మాత చెర్రీ గారిని పలకరిస్తూ "చెర్రీ.. రిజల్ట్ బాగుందా. మంచి మంచి న్యూసులు వినబడుతున్నాయి. ఇది సక్సెస్ మీటా ఏంటి?" అని అడిగారు. వారు ఏదో సమాధానం చెప్పిన తర్వాత "ఎందుకంటే టాలీవుడ్ డిక్షనరీ అని వేరే ఉంది. 'బాబుగారు' అంటే హీరో.. 'సక్సెస్ మీట్' అంటే సినిమా ఫ్లాప్. మన సినిమా బాగానే ఉందిగా" అని చమత్కరిస్తూ తన మీడియా ప్రతినిదులపైకి దృష్టి సారించారు. "మీరందరూ ఈ టీమ్ ని ఇంటరాగేట్ చేస్తున్నట్టుగా అనిపించి పైకి వచ్చాను. పది నిముషాల నుంచి వెనక కూర్చున్నాను రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని స్టేజ్ మీదకు వచ్చాను" అంటూ మీడియాపై కూడా ఒక ఛలోక్తి విసిరారు.

సినిమా హిట్ అయినా అతి పెద్ద డిజాస్టర్ అయినా ఫిలిం మేకర్స్ 'సక్సెస్ మీట్' జరుపుతారని అందరికీ తెలిసిన విషయమే. సినిమా ప్రచారం కోసం అలా చేస్తారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఇలా సక్సెస్ మీట్ పై సెటైర్లు వేయడం చాలామందికి రుచించడం లేదు. బయటివారు విమర్శిస్తే సరే కానీ ఇండస్ట్రీ వారే ఒకరిని ఒకరు తక్కువ చేసుకుంటే ఎలా అని కీరవాణి తీరును తప్పుపడుతున్నారు. కీరవాణి పని చేసిన సినిమా ఫ్లాప్ అయితే కూడా ఇలాంటి కామెంట్లు చేస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. బాబుగారు అంటే హీరో అని చెప్పారు..మరి కీరవాణి ఎంతో మంది టాప్ హీరోలతో పని చేశారు కదా... అలా 'బాబుగారు' అంటూ హీరోలను ఎప్పుడూ సంభోదించ లేదా అని కూడా అడుగుతున్నారు. ఇక 'టాలీవుడ్ డిక్షనరీ' అంటూ సెటైర్ వెయ్యడం కూడా చాలామందికి మింగుడుపడడం లేదు. అలా అని మీడియాను వదిలారా అంటే..అదీ లేదు. "మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు" అంటూ వారిని కూడా ఆడిపోసుకున్నారు. ఎదేమైనా కీరవాణి వ్యవహరించిన తీరు హుందా గా లేదనే వాదన వినిపిస్తోంది.


Tags:    

Similar News