శేఖర్ కమ్ముల గురించి ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పాడు

Update: 2021-10-03 12:30 GMT
తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సినీ ప్రముఖుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. అలాంటి ఆయన తాజాగా తీసిన మూవీ లవ్ స్టోరీ. మ్యూజికల్ గా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా కంటే మ్యూజిక్ పరంగా పెద్దహిట్ అయ్యిందని చెప్పాలి. సినిమాకు విడుదలకు ముందే.. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ రికార్డుల్ని బద్దలు కొట్టేయటం తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పవన్ సీహెచ్ పని చేశారు. అచ్చ తెలుగు కుర్రాడైన పవన్ గురించి వివరాలు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి.

దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరైన ఎఆర్ రహ్మాన్ కు అత్యంత ప్రియ శిష్యుడు ఆయనతో కలిసి పని చేసే పవన్ ను లవ్ స్టోరీ కోసం శేఖర కమ్ముల ఎంపిక చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పవన్ తండ్రి కెమెరా మన్ విజయ్ కుమార్ కుమారుడు. ఆయన శేఖర్ కమ్ముల టీంలో ముఖ్యుడు. అయినప్పటికీ కొడుకు గురించి తండ్రి చెప్పలేదు. లవ్ స్టోరీ ప్రాజెక్టు గురించి తెలిసి.. హేయ్ పిల్లా పాట బాణిని పంపటం.. అది కాస్తా శేఖర్ కు బాగా నచ్చటంతో.. ఎవరీ అబ్బాయి అని ఆరా తీశారు.

చివరకు విజయ్ కుమార్ అబ్బాయినని తెలిసి ఆశ్చర్యపోయారు. లవ్ స్టోరీకి సంగీతదర్శకుడిగా అవకాశం ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేఖర్ గురించి పవన్ ఎవరికి తెలియని కొత్త విషయాన్ని వెల్లడించారు. శేఖర్ కు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక అలవాటు ఉందని చెప్పిన ఆయన.. 'అలనాటి భానుమతి మొదలు నేటి లేడీ గాగా వరకు ప్రపంచంలో వచ్చే ప్రతి పాటను వినే అలవాటు శేఖర కమ్ములకు ఉంది. ఆయన చక్కగా పాడతారు కూడా. ప్రపంచ సంగీతంపై ఆయనకు అంత పట్టుంది కాబట్టే.. అంత చక్కటి పాటలు తీసుకుంటారు' అంటూ కొత్త సీక్రెట్ ను రివీల్ చేశారు.

అంతేకాదు.. లవ్ స్టోరీలో పాటలు అంతలా హిట్ అయ్యాయంటే దాని క్రెడిట్ తనది యాభై శాతమేనని.. మిగిలిన యాబై శాతం శేఖర్ కమ్ములదేనని చెప్పుకొచ్చారు. తన తండ్రి చాలా తక్కువగా మాట్లాడతారని.. అలాంటి ఆయన లవ్ స్టోరీ పాటలు విన్న తర్వాత మాత్రం.. చాలాసేపు మాట్లాడారని.. తన తాత నాగేశ్వరరావుకు తన పిల్లలంతా సంగీతం వైపు వెళ్లాలని ఉండేదని చెప్పారు. ఆ విషయాన్ని ఇన్నాళ్లకు.. .లవ్ స్టోరీ పాటలు విన్న తర్వాత తన తండ్రి తనతో చెప్పినట్లుగా వెల్లడించారు. నిజంగానే.. ఇది మరింత ఆసక్తికరమైన అంశం కదూ?
Tags:    

Similar News