ఇత‌డు ఓ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.. ఎవ‌రో క‌నిపెట్టారా?

Update: 2021-08-06 16:24 GMT
టాలీవుడ్ లో అత‌డు అగ్ర సంగీత దర్శ‌కుడు. 2018-21 సీజ‌న్ లో అత‌డి గ్రాఫ్ అమాంతం పెరిగింది. 2020లో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ తో రేంజ్ ఒక్క‌సారిగా చుక్క‌ల్ని తాకింది. ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోల సినిమాల‌న్నీ అతడి ఖాతాలోనే ప‌డిపోయాయి. ఇంతింతై అన్న చందంగా స‌ద‌రు యువ సంగీత ద‌ర్శ‌కుడు ఎదిగిన తీరుకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాపీ క్యాట్ అని పిలిచిన నోళ్లే ఇప్పుడు తెగ పొగిడేస్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా సంగీత ద‌ర్శ‌కుడు?.. ఇదిగో ఈ ఫోటోలో బుడ‌త‌డిలా క‌నిపిస్తున్న అత‌డిని గుర్తు ప‌ట్టారా..!?

సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ గురించే ఇదంతా. ఇటీవ‌ల త‌న‌ కెరీర్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం అగ్ర హీరోల చిత్రాల‌న్నింటికీ థ‌మ‌న్ సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్ హీరోల‌కు బాణీలు స‌మ‌కూర్చి త‌న ట్యాలెంట్ ప్రూవ్ చేసారు. మ‌ధ్య‌లో థ‌మ‌న్ ఒకే ర‌క‌మైన సంగీతం అందిస్తున్నార‌ని విమ‌ర్శ‌లొచ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని ముందుకు సాగిపోతున్నారు. సంగీతంలో కొత్త‌ద‌నం ప‌రిచ‌యం చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మిస్తున్నారు. అయితే ప్ర‌తీ సాంగ్ లోనూ థ‌మ‌న్ విరివిగా డ్ర‌మ్స్ పైనే ఆధార‌ప‌డ‌డంపై ఇంకా కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

అప్ప‌ట్లో దివంగ‌త ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు సైతం థ‌మ‌న్ డ్రమ్స్ పై  అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలున్నాయి. దానికి థ‌మ‌న్ గురువుగారు అంటూ త‌న‌దైన శైలిలో ఓ న‌వ్వు న‌వ్వి బ‌దులిచ్చారు. ఆ న‌వ్వులో  మార్పు చూపిస్తాన‌ని ఓ అర్ధాన్ని కూడా చూపించే ప్ర‌య‌త్నం చేసారు. మ‌రి థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత డ్ర‌మ్స్ ని ఇంత‌గా ఇష్ట‌పడ్డారా? అంటే అవున‌నే అనాలి. ఎందుకంటే థ‌మ‌న్ కి డ్ర‌మ్స్ వాయించ‌డం అంటే ఎంత పిచ్చో త‌న బాల్యం నాటి ఫోటో చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. సంగీత ప్ర‌పంచంలో పుట్టిన థ‌మ‌న్ చిన్న నాటి నుంచి సంగీతం మ‌ధ్య‌నే పెరిగారు.

దానికి సంబంధించిన థ‌మ‌న్ చిన్న‌నాటి ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఇన్ స్టా వేదికగా థ‌మ‌న్ వాటిని షేర్ చేసి త‌న ప్ర‌పంచం గురించి చెప్ప‌క‌నే చెప్పారు. మ్యూజిక్ ప‌రిక‌రాలు...బాక్సులు.. స్టిక్స్ తో డ్ర‌మ్స్ ను వాయిస్తోన్న ఫోటోల్ని షేర్ చేసారు. దీన్ని బ‌ట్టే థ‌మ‌న్ కి డ్ర‌మ్స్  వాయించ‌డం అంటే ఎంత ఆస‌క్తి ఉందో అర్ధ‌మ‌వుతోంది.  ఘంట‌సాల మ‌న‌వ‌డిగా సినీప్ర‌పంచంలోకి ప్ర‌వేశించిన థ‌మ‌న్ తొలుత న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా స్థిర‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. డ్ర‌మ్స్ లో థ‌మ‌న్ ని కొట్టేవాళ్లే లేరు.. కానీ అత‌డి మ్యూజిక్ రేంజ్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

త్రివిక్ర‌మ్ తో జ‌ర్నీ మార్చింది!

తాను కెరీర్ లో ఎంద‌రు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కానీ 2018లో త్రివిక్ర‌మ్ తో ప‌రిచ‌యం మొద‌ల‌య్యాక అంతా మారిపోయింద‌ని థ‌మ‌న్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అర‌వింద సమేత‌కు ప‌ని చేశాక త‌న తీరుతెన్నులు అమాంతం మారిపోయాయ‌ని థ‌మ‌న్ తెలిపారు. త్రివిక్ర‌మ్ త‌న సంగీతాన్ని మార్చేవార‌ని .. ఆయ‌న ప్ర‌తిదీ అందంగా వివ‌రించి చెప్పార‌ని కూడా అన్నారు. ఇక త‌న జీవితంలో త్రివిక్రమ్ ఒక భాగం అని కూడా అన్నారు. ఈ నాలుగేళ్ల‌లో ఆయ‌న ప‌రిచ‌యం ఎంతో మార్చేసింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. థ‌మ‌న్ చెబుతున్న‌దానిలో నిజం క‌నిపిస్తోంది. అర‌వింద స‌మేత ట్యూన్లు ఆక‌ట్టుకున్నాయి. అలాగే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో అంతా మార్చేసి చూపించాడు. అల పాట‌లు ఎప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌ర్స్ గా నిలిచిపోయాయి.

ఇటీవ‌ల పెద్ద సినిమాల‌కు ప‌ని చేస్తున్నా.. చిన్న చిత్రాల్ని వ‌దిలి పెట్ట‌లేద‌ని స్క్రిప్టు న‌చ్చితే పారితోషికం కూడా తీసుకోకుండా ప‌ని చేస్తాన‌ని చాలా కాలంగా ఇలానే చేస్తున్నాన‌ని కూడా థ‌మ‌న్ తెలిపారు. ల‌ఘు చిత్రాలు... వెబ్ సిరీస్ ల‌కు కూడా ప‌ని చేస్తాన‌ని న‌చ్చితే డ‌బ్బులు అడ‌గ‌న‌ని కూడా థ‌మ‌న్ అన్నారు. స్పోర్ట్స్ జోన‌ర్ కి ప‌ని చేయ‌డం త‌న క‌ల అని అలాంటివాటితో మ‌రింత‌గా నిరూపించుకునే వీలుంటుంద‌ని థ‌మ‌న్ అన్నారు. మ‌హేష్ స‌ర్కార్ వారి పాట‌.. ప‌వ‌న్ -హ‌రీష్ సినిమా స‌హా ప‌లువురు అగ్ర హీరోల చిత్రాల‌కు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ సినిమాకి థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డంతో అతడి పేరు మార్మోగుతోంది.
Tags:    

Similar News