వర్మ సినిమా చూడొద్దని మొత్తుకుంటోంది

Update: 2016-07-02 05:37 GMT
రామ్ గోపాల్ వర్మ మీద పెద్ద పోరాటమే మొదలుపెట్టినట్లుంది వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి. తన దగ్గర మంచిగా మాట్లాడి వీరప్పన్ గురించి సమాచారమంతా రాబట్టి.. ఆ తర్వాత తనకిష్టం వచ్చినట్లు సినిమా తీశాడంటూ ఇప్పటికే ఓసారి మీడియా ముందుకొచ్చి వర్మ మీద ధ్వజమెత్తింది ముత్తులక్ష్మి. తాజాగా ఆమె తన భర్త మీద వర్మ తీసిన సినిమా చూడొద్దని పిలుపునిస్తూ.. మరోసారి గళమెత్తింది ముత్తులక్ష్మి. తెలుగు-కన్నడ భాషల్లో వీరప్పన్‌ ను చంపే ఆపరేషన్ నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ తీసిన వర్మ.. ఆ తర్వాత వీరప్పన్ పూర్తి జీవితాన్ని తెరమీదికి తెస్తూ హిందీలో ‘వీరప్పన్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. దీన్ని తమిళంలోకి ‘విల్లాది విల్లన్ వీరప్పన్’ పేరుతో అనువాదం చేశారు. ఈ శుక్రవారమే ఆ చిత్రం తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు బహిష్కరించాలంటూ మీడియా ముందుకొచ్చింది ముత్తులక్ష్మి.

తన భర్త గురించి వర్మకు ఏమీ తెలియదని.. ఇష్టం వచ్చినట్లు కథలు అల్లేశాడని ముత్తులక్ష్మి వర్మపై ధ్వజమెత్తింది. ఈ సినిమాలోని కథ వీరప్పన్ నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని.. కాబట్టి ఆ సినిమాను తమిళ ప్రేక్షకులు చూడొద్దని ఆమె పిలుపునిచ్చింది. వీరప్పన్ జీవిత కథతో హిందీలో మాత్రమే సినిమా తీస్తున్నట్లు తనతో చెప్పిన వర్మ.. ఇప్పుడు తన అనుమతి లేకుండానే వేరే భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. వీరప్పన్ గురించి తనకు తెలిసినట్లు వేరెవ్వరికీ తెలియదని.. సినిమాల్లో చూపిస్తున్నదంతా అబద్ధమని ఆమె అంది. మరోవైపు ‘లాస్ట్ ఎన్‌కౌంటర్’ పేరుతో ఐపీఎస్ అధికారి విజయకుమార్ పుస్తకం రాస్తున్నట్లు సమాచారం తెలిసిందని.. అందులో తన భర్తను ఎలా చంపాడో వివరించే ధైర్యం ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించింది.
Tags:    

Similar News