నాకు నేనే పోటీ అంటున్న బ్యూటీ

Update: 2018-05-05 17:30 GMT
‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆమె మళ్లీ ఇటు వైపు చూడలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం దిశా కెరీర్ దివ్యంగా సాగుతోంది. ఇటీవలే ఆమె ‘బాఘి-2’ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ‘ఎం.ఎస్.ధోని’ సినిమాకు దిశాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో మంచి మంచి అవకాశాలే ఉన్నాయి. కెరీర్ మాంచి ఊపుమీదున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఏ స్థాయికి చేరాలనే విషయంలో ఏమైనా గోల్స్ ఉన్నాయా.. మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది దిశ. తనకు తానే పోటీ అని.. తాను ఇంకెవరినీ పోటీగా భావించనని ఆమె స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో పోటీ గురించి తాను నమ్మనని.. తాను ఎప్పుడూ తన పని చూసుకుంటానని చెప్పింది.

ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు అని అడిగితే.. ‘‘ప్రేక్షకుల్ని నిరంతరం అలరించడమే నా ధ్యేయం. ఈ విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటుంటా. నా సినిమా చూసిన జనాలు తమ సమయం.. డబ్బు వృథా కాలేదని అనుకోవాలి. అలాంటి సినిమాల్లోనే నేను నటించాలి’’ అని దిశా చెప్పింది. ఇక ఫ్యాషన్ విషయంలో తన అభిరుచుల గురించి చెబుతూ.. ‘‘నాకు డెనిమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఐతే ఏ దుస్తులు వేసుకున్నా కంఫర్ట్ అన్నిటికంటే ముఖ్యం. ఫ్యాషన్ పేరుతో ఏది పడితే అది వేసుకోవడానికి నేను ఇష్టపడను. మనం ఆ దుస్తుల్లో సౌకర్యంగా లేకపోతే ఏమీ చేయలేం. ఈ విషయంలోనే కాదు.. ఎందులో అయినా మన కంఫర్ట్ చూసుకోవాలి. యువతకు నేనిచ్చే ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇదే’’ అని దిశా పటాని చెప్పింది.

Tags:    

Similar News