ట్రోల్‌ కు దిమ్మ తిరిగేలా బ‌దులిచ్చిన సానియా

Update: 2018-08-15 05:45 GMT
న‌చ్చినోడిని ప్రేమించ‌టం.. న‌మ్మకం క‌లిగించినోడ్ని పెళ్లాటం ఎవ‌రైనా చేసే ప‌నే. ఆ లెక్క‌న చూస్తే.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త‌న‌కు సూట్ అవుతాడ‌నుకున్న పాక్ క్రికెట‌ర్ షోయాబ్ ను పెళ్లాడ‌టం తెలిసిందే. ఒక పాకిస్థానీని పెళ్లాడినంత మాత్రాన తాను పుట్టిన దేశాన్ని.. తాను ప్రాతినిధ్యం వ‌హించిన వైనాన్ని మ‌ర్చిపోలేరు క‌దా. వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు ఎంత న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ.. ఎట‌కారం ఆడేలా చేసిన తీరును సానియా భలేగా కౌంట‌ర్ ఇచ్చారు.

తాజాగా ట్విట్ట‌ర్ లో త‌న‌పై వ‌చ్చిన ఒక ట్రోల్‌ కి ధీటుగా స‌మాధాన‌మిచ్చిన వైనాన్ని చూస్తే.. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఒక నెటిజ‌న్ హ్యాపీ ఇండిపెండెన్స్ సానియామీర్జా.. మీ స్వాతంత్య్ర దినోత్స‌వం ఈ రోజే క‌దా? అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై సానియా స్పందించింది. త‌న జాతీయ‌త మీదా.. త‌న దేశంపై త‌న‌కున్న ప్రేమాభిమానాల్ని ప్ర‌శ్నించేలా ఉన్న ఈ ట్వీట్ కు త‌న‌దైన శైలిలో బ‌లంగా రిటార్ట్ ఇచ్చారు. కాదండి.. "నా దేశానికి.. నాకు స్వాతంత్య్ర దినోత్స‌వం రేపు. నా భ‌ర్త‌ది. అత‌ని దేశానికి ఈ రోజు. మీ క‌న్ఫ్యూజ‌న్ క్లియ‌ర్ అయ్యింద‌నుకుంటా. అది స‌రే.. మీ స్వాతంత్య్ర దినోత్స‌వం ఎప్పుడు?  చూస్తుంటే.. మీరు చాలా క‌న్ఫ్యూజ్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది" అంటూ సానియా ట్వీట్ చేశారు.

మ‌రో నెల‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న సానియా.. ఈ మ‌ధ్య‌న ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తాను భార‌త్‌.. పాక్ ల‌ను క‌ల‌ప‌టం కోస‌మే పెళ్లి చేసుకున్నాన‌ని అపోహ ప‌డతార‌ని.. అది నిజం కాద‌ని.. త‌న భ‌ర్త త‌ర‌ఫు బంధువుల‌ను క‌ల‌వ‌టానికి తానుఏడాదికి ఒక‌సారి పాక్ కు వెళ‌తాన‌ని చెప్పారు

ఈ సంద‌ర్భంగా పాకిస్థానీయులు త‌న‌ను వ‌దిన‌గా భావించి.. ప్రేమ.. అప్యాయ‌త‌ల్ని పంచుతార‌ని వ్యాఖ్యానించారు. అదే సమ‌యంలో త‌న భ‌ర్త ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌పైనా ప్రేమాభిమానాలు కురిపిస్తార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. సానియా జాతీయ‌తను ప్ర‌శ్నించేలా.. త‌న మూలాల్ని ఆమె మ‌ర్చిపోయి ఉంటార‌న్న ఎట‌కారం ట్వీట్‌కు అదిరిపోయే రీతిలో సానియా సమాధానం ఇచ్చిన‌ట్లైంది. 
Tags:    

Similar News