300లతో నా ప్రయాణం మొదలైంది: యష్

Update: 2022-04-19 02:28 GMT
వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని అంటారు. అంకితభావం ఉండాలేగానీ, ఆకాశమే హద్దుగా ఎదిగొచ్చని చెబుతారు. కొంతమంది ఆ మాటలను వింటారు .. మరి కొంతమంది అది నిజమేనని నిరూపిస్తారు. అలాంటి అతి తక్కువమందిలో కన్నడ స్టార్ హీరో యష్ కూడా కనిపిస్తాడు. తను ఈ రోజున పెద్ద స్టార్ హీరో. ప్రపంచవ్యాప్తంగా పేరున్న హీరో. భాష ఏదైనా సినిమాల గురించి తెలిసినవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు. అలా అని చెప్పేసి ఆయన వందల సినిమాలు చేయలేదు. చేసింది  .. చేతి వ్రేళ్లపై లెక్కబెట్టే సినిమాలే.

కృషి  .. పట్టుదల .. దీక్ష .. గమ్యం వైపు నుంచి మరల్చని దృష్టి  ఆయనను ఈ స్థాయికి తీసుకుని వెళ్లాయి. యష్ కర్ణాటకలోని హసన్ జిల్లాకి చెందిన కుర్రాడు. తండ్రి బస్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషించేవారు. యష్ తల్లి సాధారణ గృహిణి. తండ్రి తరువాత ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్లవలసిన బాధ్యత యష్ పై ఉంది.

అయితే ఆయన ధ్యాస అంతా కూడా సినిమాలపై .. నటనపై ఉండేది. అయితే సినిమాల్లో అవకాశాలు .. లాటరీ టిక్కెట్ల లాంటివి. వాటినిపై నమ్మకాన్ని పెట్టుకుని ఎదురుచూడటంలో అర్థం లేదు.

అందువలన  యష్ కి ఆయన తండ్రి కొంత సమయం ఇచ్చారు. ఆ గడువులోగా సినిమాలలో సక్సెస్ అయితే సరే. లేదంటే తిరిగి వచ్చేసి, తాము చూపించిన పని చేసుకుంటూ వెళ్లాలి .. అంతే. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్నారు.

అందుకు అంగీకరించిన యష్ .. తండ్రి ఇచ్చిన 300 రూపాయలను జేబులో  పెట్టుకుని బయల్దేరాడు. ఆ మూడు వందలు తప్ప ఇక తండ్రి నుంచి మరేమీ తీసుకోకూడదని ఆ క్షణమే ఆయన నిర్ణయించుకున్నాడు. ఒంటరి ప్రయాణంలో డబ్బుకంటే ధైర్యం ఎక్కువ అవసరమని ఆయన భావించాడు.  

అలా 300 రూపాయలతో ఇండస్ట్రీ గుమ్మంలో దిగాడు.  ఏ రోజు కూడా సమయాన్ని వృథా చేయకుండా అవకాశాల కోసం వెదకడం మొదలుపెట్టాడు. బలమైన సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో ఆయనకి  అర్థమైంది. దాంతో ముందుగా  రోజులు గడవడం కోసం టీవీ సీరియల్స్ వైపు వెళ్లాడు. అక్కడ డబ్బుతో పాటు గుర్తింపు   తెచ్చుకున్నాడు.

ఆ క్రేజ్ ఆయనకి అవకాశాలు తెచ్చిపెట్టింది. 2008లో 'రాకీ' సినిమాతో హీరోగా మారాడు. తన కసి .. కృషి అంతా కూడా ఆ పాత్రపై పెట్టాడు. అంతే అప్పటి నుంచి ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ' కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలతో ఆయన కీర్తి ప్రతిష్ఠలు పతాకస్థాయికి  చేరుకున్నాయి. ఎదగాలనే పట్టుదలతో  ప్రయాణం మొదలుపెడితే .. కలలో కూడా కార్యసాధన మరిచిపోకపోతే, విజయం దాసోహమంటుందని నిరూపించాడు. అందుకే యష్ ఈజ్ సో గ్రేట్.
Tags:    

Similar News