‘ఆఫీసర్‌’కు దీటుగా ‘నానువ్వే’

Update: 2018-06-16 09:41 GMT
రెండు వారాల కిందట విడుదలైన అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మల ‘ఆఫీసర్’ సినిమా ఎంతటి దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కేవలం రూ.55 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసి నాగార్జున కెరీర్లోనే అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా చెత్త రికార్డును మూటగట్టుకుందీ చిత్రం. ఆ తర్వాత కూడా ‘ఆఫీసర్’ పుంజుకోలేదు. ఫుల్ రన్లో కేవలం రూ.కోటి షేర్ మాత్రమే రాబట్టింది. మీడియం రేంజి హీరోల సినిమాలకు కూడా ఇంతకంటే మెరుగైన వసూళ్లే వస్తుంటాయి తొలి రోజు. ఐతే ‘ఆఫీసర్’ వచ్చిన రెండు వారాలకే మరో సినిమా దీనికి దీటుగా పేలవమైన ఓపెనింగ్స్ సాధించింది. ఆ చిత్రమే.. నా నువ్వే. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది.

తొలి రోజు ‘నా నువ్వే’ షేర్ కేవలం రూ.60 లక్షలు మాత్రమే. ‘ఆఫీసర్’కు అలాంటి ఓపెనింగ్స్ వచ్చిందంటే అది రామ్ గోపాల్ వర్మ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ట్రాక్ రికార్డు పుణ్యం. దాని మీద అసలేమాత్రం అంచనాల్లేవు. కానీ ‘నా నువ్వే’ పరిస్థితి దాంతో పోలిస్తే మెరుగే. అయినప్పటికీ ఈ స్థాయిలో పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రానికి కూడా దారుణమైన టాక్ వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ‘నా నువ్వే’ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.7 కోట్లని అంటున్నారు. ఐతే అందులో నాలుగో వంతు వెనక్కి తేవడం కూడా చాలా కష్టంగానే అనిపిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన ‘సమ్మోహనం’కు పాజిటివ్ టాక్ రావడం.. ముందు వారం విడుదలైన ‘అభిమన్యుడు’ ఇంకా బాగా నడుస్తుండటంతో ‘నా నువ్వే’ పరిస్థితి దయనీయంగా మారేలా కనిపిస్తోంది.


Tags:    

Similar News