బ‌న్నీ అక్క‌డ హిట్టు కొట్టాడండోయ్‌

Update: 2018-05-08 14:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య‌’  సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. బాడీ వెయిట్‌ ద‌గ్గ‌ర్నుంచి హెయిర్ స్టైల్‌- లుక్ అన్నింటీనీ మార్చుకున్నాడు. యాంగ్రీ అగ్రెసివ్ మిల‌ట‌రీ మ్యాన్ సూర్య‌గా ఒదిగిపోయాడు. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబట్ట‌డంలో విఫ‌ల‌మైంది. ఎప్ప‌ట్లాగే ఇక్క‌డ లాభాలు రాక‌పోయినా ప‌క్క రాష్ట్రాల్లో మాత్రం ప్ర‌తాపం చూపుతున్నాడు బ‌న్నీ.

ఇంత‌కు ముందు బ‌న్నీ న‌టించిన ‘ప‌రుగు’- ‘జులాయి’-  ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’- ‘స‌రైనోడు’- ‘ఢీజే’ సినిమాల‌కు కూడా ముందు మిక్స్ డ్ టాకే వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత మౌత్ టాక్ తో రిపీటెడ్ ఆడియెన్స్ పెర‌గ‌డంతో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి ఆ చిత్రాలు. కొన్ని సూప‌ర్ హిట్ జాబితాలోకి కూడా చేరిపోయాయి. కానీ ‘నా పేరు సూర్య‌’ విష‌యంలో మాత్రం అలా జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజురోజుకీ క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోతున్నాయి. దీంతో బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వని తేలిపోయింది. అయితే ప‌క్క రాష్ట్రాలు త‌మిళ‌నాడు- కేర‌ళ‌ల‌లో మాత్రం అల్లు అర్జున్ లాభాలు తెచ్చిపెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

కేర‌ళ‌లో బ‌న్నీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ‘నా పేరు సూర్య‌’ సినిమాని ‘ఎండె పేరు సూర్య‌- ఎండె వీడు ఇండియా’ పేరుతో డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేశారు. కోటిన్న‌ర‌కి అమ్మితే ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మున్ముందు బ‌య్య‌ర్లు లాభాల్లోకి వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌మిళనాడులో కోటికి హ‌క్కులు అమ్మారు. అవి కూడా మ‌రో రెండు రోజుల్లో బ‌య్య‌ర్ల‌కి తిరిగి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాబ‌ట్టి అక్క‌డ కూడా మ‌నోడు హిట్టు కొట్టిన‌ట్టే. ‘నా పేరు సూర్య‌’ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవ‌డానికి ఈ విష‌యం బ‌న్నీకి- ఆయ‌న అభిమానుల‌కు  ఓ చిన్ని శుభ‌వార్తే.


Tags:    

Similar News