అరుదైన జాబితాలో నాగచైతన్య

Update: 2022-06-24 01:30 GMT
అక్కినేని నాగచైతన్య ఇప్పటికే తెలుగులో మరే హీరో సాధించని ఘనత ఒకటి సాధించాడు. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్‌తో రెండు సినిమాలకు పని చేసిన ఏకైక తెలుగు హీరో చైతూ మాత్రమే.

తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో చైతూ చేసిన ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలకు రెహమానే సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. తెలుగులో రెహమాన్ చేసిన సినిమాలే చాలా తక్కువ. వెంకటేష్‌తో సూపర్ పోలీస్, బాలయ్యతో నిప్పురవ్వ, నాగార్జునతో రక్షకుడు, పవన్ కళ్యాణ్‌తో కొమరం పులి.. ఇలా ఒక్కో సినిమానే చేశాడు.

చైతూతో మాత్రమే రెండు చిత్రాలకు పని చేశాడు. ఇప్పుడు చైతూ ఇంకో అరుదైన ఘనతను సాధించాడు. లెజెండరీ ఇళయరాజాతో అతను జట్టు కట్టబోతున్నాడు. ఇళయరాజా.. రెహమాన్‌తో కెరీర్లో ఒక్కో సినిమా అయినా చేయాలని ఆశపడే స్టార్లు చాలామంది ఉన్నారు. కానీ తెలుగులో వెంకీ, బాలయ్య, నాగ్ మాత్రమే ఆ ఇద్దరు ఆల్ టైం గ్రేట్స్‌తో పని చేశారు. ఇప్పుడు చైతూ కూడా ఆ అరుదైన జాబితాలో చేరబోతున్నాడు.

తమిళ స్టార్ర డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతూ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఇంతకముందే అధికారిక ప్రకటన వచ్చింది. చైతూ కెరీర్లో ఇది 22వ సినిమా. ఈ చిత్రం నుంచి తాజాగా రెండు ఆసక్తికర అప్‌డేట్స్ బయటికి వచ్చాయి.

ఈ చిత్రానికి ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. వెంకట్ ప్రభు ఇప్పటిదాకా తన ప్రతి సినిమాకూ తన సోదరుడైన యువన్‌తోనే సంగీతం చేయించుకున్నాడు. కానీ తొలిసారి తన పెదనాన్న ఇళయరాజాతోనూ పని చేయబోతున్నాడు. ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ కొడుకే వెంకట్ ప్రభు అన్న సంగతి తెలిసిందే.

చైతూ తొలిసారిగా ఇళయరాజా, ఆయన తనయుడు యువన్‌లతో సినిమా చేయబోతుండటం విశేషమే. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించనున్న విషయాన్ని కూడా ఈ రోజే వెల్లడించారు. ఇప్పటికే చైతూతో ఆమె 'బంగార్రాజు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ముందు వెంకట్ ప్రభు.. తమిళంలో తీసిన 'మానాడు'ను తెలుగులో చైతూతో రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారాన్ని అతను ఖండించాడు. చైతూతో ఓ కొత్త కథను తెలుగు, తమిళ భాషల్లో తీయబోతున్నాడు వెంకట్.
Tags:    

Similar News