నాగ్ మాట నెగ్గింది .. 'బంగార్రాజు'కి హిట్టు దక్కింది!

Update: 2022-01-16 11:32 GMT
గ్రామీణ నేపథ్యంలో గతంలో ఏఎన్నార్ .. శోభన్ బాబు .. బాలకృష్ణ చేసిన సినిమాలు చాలావరకూ ఘన విజయాలను అందుకున్నాయి. ఇది కథ మనది .. మన ఊళ్లో .. మనమధ్యలో జరుగుతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు, తెరపై జరుగుతున్న కథకి ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవుతారు. కథలో స్థానికతకు ఉండే గొప్పతనం అదే. కథ ఫారిన్లో జరుగుతుంటే ఈ కథ మనకి సంబంధం లేనిది అన్నట్టుగానే అంటీముట్టన్నట్టుగా చూసే ప్రేక్షకుడు, గ్రామీణ నేపథ్యంలో నడుస్తున్న కథకు ఈలలు వేసి గోల చేస్తాడు. స్థానికత అనేది ప్రేక్షకుడిపై అంతటి ప్రభావం చూపుతుంది.

అలాంటి కథా నేపథ్యమే నాగార్జునకి మరోసారి కలిసొచ్చింది. ఇంతకుముందు ఆయన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను చేశాడు. ఆ సినిమాలోని ఆయన పాత్రనే ఈ రోజున 'థియేటర్లలో సందడి చేస్తున్న 'బంగార్రాజు'. నాగార్జున పంచె గట్టి .. ముల్లుగర్ర చేతబట్టగానే సగం మార్కులు పడిపోయాయి. ఇక ఈ సినిమాలో చైతూను తీసుకోవడం .. ఆయన జోడీగా విపరీతమైన క్రేజ్ ఉన్న కృతి శెట్టిని తీసుకోవడం నాగ్ తెలివి తేటలకు నిదర్శనం. కథాకథనాల సంగతి అటుంచితే, ఈ సారి ప్లానింగ్ లోనే నాగార్జున సగం సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.  

నాగార్జున ఈ కథను నానబెట్టి చాలా కాలమైంది. అయితే ఈ కథను అలా పక్కకి పెట్టేసి అయన చేసిన కథలేవీ కూడా కలిసి రాలేదు. దాంతో ఇక తనకి తప్పకుండా ఒక హిట్ కావలసిందే అనుకున్నప్పుడే ఆయన ఈ కథను సెట్స్ పైకి తీసుకుని వచ్చాడు. అయితే ఈ సినిమాను ఏ వేసవి సెలవుల్లోనే వదులుతారని అంతా అనుకున్నారు. అయితే ఒక వైపు నుంచి ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే, మరో వైపు నుంచి అప్ డేట్ లు ఇవ్వడం చూసి అంతా షాక్ అయ్యారు. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని నాగ్ చెబితే .. రానీ చూద్దాం అనుకున్నారు.

ఈ సినిమాకి సంక్రాంతి టార్గెట్ పెట్టడం వలన దర్శకుడికీ .. సంగీత దర్శకుడికి .. ఎడిటర్ కి ఎవరికీ సరిగ్గా నిద్రలు లేవని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ్ స్వయంగా చెప్పారు. అంటే సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని రావడానికి అందరూ కూడా శివరాత్రిలా జాగరణలు చేశారన్నమాట. అంతలా అంతా కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సినిమాను పూర్తి చేశారు. నాగ్ చేతిలో డబ్బులు ఉండొచ్చు .. ఆయన వెనుక అన్నపూర్ణ స్టూడియో ఉండొచ్చు .. ఒక సినిమాను పూర్తి చేయడానికి అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్పుకోవలసింది ఆయన పట్టుదల గురించి .. ఆయనపై ఆయనకి గల నమ్మకం గురించి. సంక్రాంతికి వస్తామనే నాగ్ మాటనే చివరికి నెగ్గింది .. 'బంగార్రాజు'కి హిట్టు దక్కింది. రెండు రోజుల్లో ఈ సినిమా 36 కోట్ల గ్రాస్ ను రాబట్టడమే అందుకు నిలువెత్తు నిదర్శనం.       
Tags:    

Similar News