ఎన్టీఆర్ ఎన‌ర్జీ సూప‌ర్బ్‌: నాగ్‌

Update: 2017-07-28 11:30 GMT
త‌మిళ బిగ్ బాస్ కు క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించినా ఆ షో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. దీంతో, తెలుగు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో? తెలుగులో బిగ్ బాస్ కు ఆద‌ర‌ణ ల‌భిస్తుందో? లేదో? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తెలుగు బిగ్ బాస్ షోకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్న‌ప్ప‌టికీ, ఆ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ పై మాత్రం ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బుల్లితెర‌పై ఎన్టీఆర్ న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా,  ఎన్టీఆర్ కు యువ‌సామ్రాట్‌ నాగార్జున ట్విట్ట‌ర్ లో  శుభాకాంక్షలు తెలిపాడు.

బిగ్ బాస్ షో ఓపెనింగ్ వీక్ లో అద్భుతమైన టీఆర్పీలను సాధించింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎపిసోడ్స్ కు రికార్డ్ స్థాయి టీఆర్పీలు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ను నాగ్ అభినందించాడు. బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ ఎనర్జీ సూపర్బ్ అంటూ కితాబిచ్చాడు. నాగ్ ట్వీట్ పై స్పందించిన ఎన్టీఆర్ థ్యాంక్స్ బాబాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు. మీరు చూపించిన మార్గంలోనే నేను న‌డుస్తున్నా అంటూ  ట్వీట్ చేశాడు.

70 రోజుల పాటు కొనసాగనున్న బిగ్ బాస్ షోలో శని - ఆదివారాల్లో మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఆ రెండు రోజుల్లో షోకు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో, రికార్డు స్థాయిలో టీఆర్పీలు వ‌చ్చాయి. టాలీవుడ్ నుంచి తొలిసారిగా బుల్లితెర హోస్ట్ గా నాగ్ వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో యాంకర్ గా నాగ్ సక్సెస్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఈ షోకు మెగా స్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్య‌వ‌హరించారు.
Tags:    

Similar News