మీరంతా మీసం తిప్పే సినిమా ఇది: నాగార్జున

Update: 2022-01-13 17:20 GMT
నాగార్జున సీనియర్ బంగార్రాజుగా .. జూనియర్ బంగార్రాజుగా నాగచైతన్య నటించిన 'బంగార్రాజు'పై భారీ అంచనాలు ఉన్నాయి. రేపు థియేటర్స్ కి రానున్న ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాగ్ నమ్మకం చూసిన వాళ్లంతా ఈ సినిమాలో కంటెంట్ బలంగానే ఉందని అనుకుంటున్నారు. కొంతసేపటిక్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ .. "సంక్రాంతి పండుగ .. తెలుగు సినిమా ప్రేక్షకులు ఫెవికాల్ లాగా అతుక్కుని ఉంటారని ఎవరో అనగా విన్నాను. మరి అలాంటి సంక్రాంతికి మన సినిమా లేకపోతే ఎట్లా?

ఈ సినిమాకి సంబంధించిన నా వజ్రాలన్నీ కూడా ఇక్కడ ముందు కూర్చున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబట్టాను. నేను ఎంత పట్టుదలతో ఉన్నానో .. నాకంటే ఎక్కువ పట్టుదలతో వాళ్లు పనిచేశారు .. ఈ సినిమాను రిలీజ్ కి రెడీ చేశారు. అందువలన వాళ్లందరికీ ఫస్టు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాలో వాడూ మీసం తిప్పుతాడు .. నేనూ మీసం తిప్పుతాను. రేపు సినిమా చూసిన తరువాత మీరంతా మీసం తిప్పుతారు .. వాసి వాడి తస్సాదియ్యా అంటారు. నేను అనుకున్న అవుట్ పుట్ ను ఇవ్వడానికి నా టెక్నీషియన్స్ ఎవరూ సరిగ్గా నిద్రకూడా పోలేదు.

అనూప్ ఇచ్చిన పాటలు విన్నారు గదా? లడ్డుండ లాంటి పాటలను ఇచ్చాడు. ఇక రామ్ లక్ష్మణ్ అయితే మా కంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేశారు. ఎవరు రామ్? .. ఎవరు లక్ష్మణ్? అనేది నాకు ఇప్పటికీ కన్ ఫ్యూజనే. సెట్స్ విషయంలో ఎంతమాత్రం ఆలస్యం కాకుండా బ్రహ్మకడలి చూసుకున్నాడు. కల్యాణ్ కృష్ణ ఈ సినిమా కోసం చాలా వండర్ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇది చిన్న సినిమా కాదు .. ఇంత పెద్ద సినిమాను .. ఇంత తక్కువ సమయంలో చేయడం ఈజీ కాదు. ఇంతమంది ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు.

ఇంత కష్టపడుతూ కూడా తను ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆయన ఇరిటేషన్ తో ఉండటం నేను ఒక్కసారి కూడా చూడలేదు. కల్యాణ్ గురించి ఇంకా చాలా చెప్పాలి .. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. అనసూయకి ఈ సినిమాలో వేషం ఇవ్వకపోవడం గురించి ప్రస్తావిస్తూ .. ఆమెను ఉద్దేశించి "బుజ్జీ ఈ సారి కుదరలేదు .. పెట్టేసేయ్ ఎవరూ పట్టించుకోరు అని కల్యాణ్ తో అన్నాను .. తను వినలేదు" అన్నారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే, మాస్ కావాలనుకుంటున్నారు  కదా వస్తుంది అంటూ చైతూ వైపు చూపించారు.

ఈ సినిమాలో చైతూ చాలా బాగా చేశాడు. లవ్ స్టోరీస్ నుంచి ఒక్కసారిగా ఇటు వైపు వచ్చి కంప్లీట్ ఓపెన్ అప్ అవుతూ చేశాడు. ఈ సినిమాను గురించి బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ రోజున చెబుతాను .. అందరినీ పిలిచి చెబుతాను. కోవిడ్ కారణంగా ఫ్యాన్స్ అందరినీ పిలుచుకోలేకపోయాను. చాలా ధూమ్ ధామ్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేద్దామని అనుకున్నాను .. కానీ ఇంతకన్నా పర్మిషన్ ఇవ్వలేదు. అనుకున్నట్టుగా ఆ తరువాత చేద్దాం. మళ్లీ మనమంతా సక్సెస్ మీట్లో కలుసుకుందాం" అంటూ చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News