అక్కినేని నాగార్జున కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ భక్తిరస చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఓం నమో వెంకటేశా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నా.. ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే ఈ చిత్ర నిర్మాణంపై హథీరాం బాబా మఠం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బాబా జీవితాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే సహించబోమని తెలిపింది.
అయితే ఈ అభ్యంతరాలను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పట్టించుకోవడం లేదు. జూలై 2వ తేదీన ఈ చిత్రం షూటింగ్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభం కానుంది. ఒకసారి మొదలయ్యాక ఆపకుండా షూటింగ్ కొనసాగేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే హథీరాం బాబా పాత్ర కోసం నాగార్జున పెద్ద గడ్డాన్ని కూడా పెంచి సిద్ధమైపోయారు.
హథీరాం బాబా మఠ సభ్యులకు తర్వాత వివరణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాగ్-రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ భక్తిరస చిత్రంలో అనుష్క ఓ భక్తురాలి పాత్రను పోషిస్తోంది. విమలారామన్ ఈ మూవీలో అమ్మవారిగా కనిపించనుండగా.. ప్రగ్యా జైస్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.