నాగార్జున సేవ్ చేస్తాడా?

Update: 2016-09-15 17:30 GMT
మన దగ్గర పిల్లల సినిమాలు కానీ.. టీనేజ్ లవ్ స్టోరీలు కానీ ఆడిన దాఖలాలు పెద్దగా కనిపించవు. తమిళం.. మలయాళం.. హిందీ లాంటి భాషల్లో ఈ తరహా సినిమాలు బాగానే ఆడుతుంటాయి. మన దగ్గర మాత్రం ఆ తరహా సినిమాలనగానే ఓ రకమైన వ్యతిరేక ముద్ర పడిపోతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో వాటిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో దర్శకులు సక్సెస్ కాలేకపోయారు. ప్రేక్షకులు కూడా ఆ తరహా సినిమాలపై ఆసక్తి ప్రదర్శించడం తక్కువ. ఇలాంటి టైంలో వస్తున్న ‘నిర్మలా కాన్వెంట్’ చరిత్రను మారుస్తుందేమో చూడాలి. ఇంతకుముందు వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీలతో పోలిస్తే దీని మీద పాజిటవ్ బజ్ ఉంది.

ట్రైలర్ చూస్తే సినిమా ఆసక్తికరంగానే సాగేలా కనిపిస్తోంది. ఐతే ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా.. సినిమా ఏ స్థాయికి వెళ్తుంది అన్నది అక్కినేని నాగార్జున మీదే ఆధారపడి ఉంది. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది పిల్లల సినిమా అన్న ముద్ర పడిపోతుందేమో అన్న భయంతోనే తనది కీలక పాత్ర అని.. ద్వితీయార్ధమంతా తాను తెరపై కనిపిస్తానని నొక్కి చెప్పాడు నాగ్. వ్యాపార దృక్పథం బాగా ఉన్న నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో పాటు ముఖ్య పాత్ర చేయడానికి ముందుకొచ్చాడంటేనే ఈ కథలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా.. నాగ్ క్యారెక్టర్ ఎంత బాగా ఉంటుందనేదాని మీదే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. గత ఏడాది ఎన్నో అనుమానాల మధ్య రిలీజైన ‘రుద్రమదేవి’ అంత పెద్ద స్థాయికి వెళ్లిందంటే అందుకు అల్లు అర్జున్ స్పెషల్ రోలే కారణం. అలాగే నాగ్ క్యారెక్టర్ కూడా ‘నిర్మలా కాన్వెంట్’ను సేవ్ చేస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News