ఎన్టీఆర్‌.. నాగ్ క‌లిసి న‌టించుంటే?!

Update: 2016-03-19 05:38 GMT
ఊపిరి సినిమా సంచ‌ల‌నాత్మ‌క కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కాల్సింది. నాగార్జున‌ - ఎన్టీఆర్‌ ల‌తో ఆ సినిమాని తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేశారు. ఆ మేర‌కు ఇద్ద‌రినీ కూర్చోబెట్టి మాట్లాడించారు. ఆ ఇద్ద‌రూ కూడా ఆనందంగా ఒప్పుకొని క‌లిసి న‌టించాల‌ని డిసైడ్ అయ్యారు. కానీ ఎన్టీఆర్‌ కి అనూహ్యంగా కాల్షీట్ల స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో `ఛ‌... మంచి కాంబినేష‌న్ మిస్స‌య్యిందే` అని అంతా డీలా ప‌డిపోయారు. అక్కినేని - నంద‌మూరి అభిమానులైతే తెగ ఫీలైపోయారు. తార‌క్ త‌ప్పుకోవ‌డంతో ఆ ప్రాజెక్టులోకి కార్తీ వ‌చ్చాడు. కార్తీ రాక‌తో ఊపిరి సినిమా బై లింగ్వ‌ల్ ప్రాజెక్టు అయ్యింది. అప్ప‌టిదాకా నాగ్ - ఎన్టీఆర్‌ ల‌తో తెలుగులోనే తీయాల‌నుకొన్న నిర్మాత పీవీపీ కార్తీ రాక‌తో తెలుగు - త‌మిళ భాష‌ల్లో నిర్మించాల‌ని డిసైడ్ అయ్యాడు. అలా  రెండు భాష‌ల్లో సినిమా తెర‌కెక్క‌డంతో నిర్మాత‌కి చాలా ప్లస్స‌యింద‌ట‌. ఒక‌వేళ ఎన్టీఆర్‌ - నాగార్జున‌ల‌తో సినిమా తెర‌కెక్కుంటే విడుద‌ల కాక‌మునుపే ఆ చిత్రం ఫ్లాప్ అయ్యేద‌ట‌. ఇప్ప‌టికే ఆ సినిమాకి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా 60కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. 

రెండు భాష‌ల్లో కాకుండా ఒక భాష‌లో అంత బ‌డ్జెట్‌ తో సినిమా చేసుంటే పెట్టుబ‌డి కూడా తిరిగొచ్చేది కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నాగార్జున కూడా అదే మాట చెబుతున్నాడు. ``ఒక‌వేళ నేను తార‌క్ క‌లిసి ఈ సినిమా చేసుంటే ఇంత బ‌డ్జెట్ పెట్ట‌కుండా ఉండాల్సొచ్చేది. 30 లేదా 40 కోట్ల‌లో సినిమాని పూర్తి చేయాల్సొచ్చేది.  బై లింగ్వుల్ ప్రాజెక్టు అయ్యింది కాబ‌ట్టి భారీ హంగుల‌తో సినిమా చేసే అవ‌కాశం దొరికింది. ఇందులోని ప్ర‌తి స‌న్నివేశం ఫ్రెంచ్ ఇన్‌ ట‌చ‌బుల్స్‌ కి ధీటుగా ఉంటుంద‌``ని నాగార్జున చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News