నేషనల్ అవార్డు గ్యారెంటీ అంటున్న నాగ్

Update: 2016-09-17 09:29 GMT
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిందని.. మంచి సినిమాలకు మంచి ఫలితాల్ని అందిస్తున్నారని అన్నాడు అక్కినేని నాగార్జున. ఇలాంటి టైంలో ప్రకాష్ రాజ్ తీసిన ‘మనవూరి రామాయణం’ ఒక గొప్ప మలుపు అవుతుందనిపిస్తోందని.. ఈ సినిమా ఆయనకు దర్శకుడిగా నేషనల్ అవార్డు తెచ్చిపెడుతుందని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమా ఆడియో వేడుకలో నాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నాగ్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘కొన్ని ఆడియో వేడుకలకు ఆబ్లిగేషన్ మీద వెళ్తాం. కొన్ని ఫంక్షన్లకు మాత్రమే సంతోషంతో వెళ్తాం. ప్రకాష్ రాజ్ కోసం చేసే పని ఏదైనా నాకు సంతోషం కలిగిస్తుంది. మనం రాముడిని పూజిస్తాం. కొన్ని దేశాల్లో రావణాసురుడిని పూజిస్తారు. నాకు కూడా రావణాసురుడు అంటే చాలా ఇష్టం. ప్రకాష్ రాజ్ ను కూడా అందుకే ఇష్టపడతా. ప్రకాష్ రాజ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. నటిస్తాడు. డైరెక్ట్ చేస్తాడు. వ్యవసాయం చేస్తాడు. చేపలు పడతాడు. సినిమాల గురించి మాట్లాడతాడు. ఐతే ఏం చేసినా ప్రతి మూమెంట్ కూడా ఆస్వాదిస్తాడు. తన లైఫ్ లో ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు. తనను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. ప్రకాష్ లాగా ఉండాలనిపిస్తుంది.

ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా గురించి వేరే వాళ్ల దగ్గర చెబుతుంటే.. ఆయనకు ఈ డైరెక్షన్ పిచ్చేంటి.. ఆర్గానిక్ ఫార్మింగ్ పిచ్చేంటి అన్నారు. కానీ నేను ఆ మాటలతో ఏకీభవించను. ప్రకాష్ ఏం చేసినా ఇష్టంతో చేస్తాడు. తనకేం కావాలో తనకు తెలుసు. శివమణి షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లినపుడు నాకు.. ప్రకాష్ రాజ్ కు ఒకేసారి జ్వరం వచ్చింది. నేను రెండు రోజులు పడుకుండిపోయాను. కానీ ప్రకాస్ మాత్రం 104 డిగ్రీల జ్వరంలోనూ షూటింగ్ లో పాల్గొన్నాడు. అదీ తన ప్రత్యేకత. ఆయన డైరెక్ట్ చేసిన ‘మనఊరి రామాయణం’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో తెలియదు. కానీ ఇది ఇండయన్ సినిమాలోనే ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నా. ప్రకాష్ కు దర్శకుడిగా జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నా’’ అని నాగ్ అన్నాడు.
Tags:    

Similar News