శ్రీదేవి హీరోయిన్ అంటే.. నాగ్ వద్దన్నాడట

Update: 2018-09-25 11:34 GMT
ఇండియన్ ఫిలిం హిస్టరీలో శ్రీదేవిని మించిన స్టార్ డమ్ తెచ్చుకున్న కథానాయిక మరొకరు ఉండరు. ఇటు దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌ గా ఎదిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరోయిన్ అయింది. 80లు.. 90ల్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెతో నటించడానికి స్టార్ హీరోలు కూడా పోటీ పడేవాళ్లు. అలాంటి కథానాయికతో సినిమా చేయడానికి అక్కినేని నాగార్జున వెనుకంజ వేశాడట. ‘ఆఖరి పోరాటం’ చిత్రానికి శ్రీదేవిని కథానాయికగా ఓకే చేస్తే ఆయన నో అన్నాడట. ఇందుకు కారణమేంటో ‘దేవదాస్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసినపుడు నాగ్ వెల్లడించాడు.

వైజయంతీ మూవీస్ సంస్థలో ‘ఆఖరి పోరాటం’ చేయడానికి ముందు తనకు స్టార్ ఇమేజ్ లేదని.. అంతకుముందు చేసిన సినిమాలతో విమర్శలు ఎదుర్కొన్నానని నాగ్ చెప్పాడు. సన్నగా ఉన్నాడు.. డైలాగులు సరిగా చెప్పట్లేదు అని తనపై విమర్శలు వచ్చాయని.. అలాంటి సమయంలో ‘ఆఖరి పోరాటం’ చిత్రానికి శ్రీదేవి హీరోయిన్ అని అశ్వినీదత్ చెప్పాడని.. ఆమె ఉంటే తనకింక ఏం గుర్తింపు వస్తుందని తాను సందేహించానని.. ఆమె వద్దు అన్నానని నాగ్ వెల్లడించాడు. ఐతే దత్ నేరుగా నాగేశ్వరరావు దగ్గరికెళ్లి కూర్చున్నాడని.. ఆయన ద్వారా తనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారని అన్నాడు. శ్రీదేవితో నటిస్తే తాను కూడా ఎలివేట్ అవుతానని..దీంతో పాటు రాఘవేంద్రరావు.. అశ్వినీదత్ లాంటి అనుభవజ్ఞులు చాలా విషయాలు నేర్పిస్తారని తన తండ్రి తనకు నచ్చ చెప్పాడని.. దీంతో ఆ సినిమా శ్రీదేవితోనే చేశానని.. సినిమా హిట్టయి తనకు మంచి పేరు తెచ్చిందని నాగ్ వెల్లడించాడు. వైజయంతీ మూవీస్‌ లో ‘రావోయి చందమామ’ తర్వాత ఇన్నేళ్లకు ‘దేవదాస్’ చేయడం చాలా సంతోషమని.. ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందని నాగ్ ఆకాంక్షించాడు.
Tags:    

Similar News