'శివమణి' వచ్చి చెప్పినా మాస్కులు వేసుకోరా...!

Update: 2020-04-25 12:30 GMT
టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'శివమణి'. ఇందులో నాగ్ పోలిస్ పాత్రలో నటించాడు. 2003 లో వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగార్జునతో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ లో డైలాగ్స్ చెప్పించాడు. పూరీ ఈ సినిమా కోసం రాసిన 'శివమణి.. నాక్కొంచెం మెంటల్' అనే డైలాగ్ ఇప్పటికీ వింటూనే ఉంటాం. సినిమా వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కింగ్ నాగార్జున ఈ సినిమాని కరోనా నేపథ్యంలో గుర్తు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఎమర్జెన్సీకి  తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అధికారుల మాటలు లెక్క చేయకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. వివిధ సినిమా పోస్టర్ల ద్వారా అలాగే అనేక ఫన్నీ వీడియోలు రూపొందిస్తూ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'కింగ్‌' నాగార్జున ఆయన నటించిన 'శివమణి' సినిమాలోని డైలాగులను కరోనా డైలాగ్స్ గా మార్చిన ఓ వీడియోను ట్విటర్‌ లో షేర్‌ చేశారు. 'నేను ఇప్పడు శివమణి సినిమా చేస్తే కరోనా సంక్షోభంలో పూరి జగన్నాథ్‌ రాసే డైలాగులు ఇలానే ఉంటాయి' అని ట్వీట్ చేసాడు.

'శివమణి' సినిమాలో నాగ్‌ పూర్ణా మార్కెట్‌ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ గా వచ్చినప్పుడు రౌడీషీటర్లకు వార్నింగ్‌ ఇస్తాడు. మిమిక్రి ఆర్టిస్ట్ భవిరి రవి తన మిమిక్రి వాయిస్ తో శివమణి రౌడీలకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని మీమ్ చేశారు. మాస్కులు వేసుకోవాలని.. బయట తిరగొద్దని.. మోడీ మాట వినాలని నాగార్జున మిమిక్రి వాయిస్ తో బవిరి రవి చెప్పిన డైలాగ్స్ ఆ వీడియోకి చక్కగా సరిపోయాయి. ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్‌.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌ గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది.. ఇప్పటికైనా ఒకరికొకరు దూరంగా ఉండటానికి ట్రై చేయండి.. ' అంటూ నాగార్జున రౌడీలకు ఇస్తున్న వార్నింగ్‌ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన పూరి జగన్నాథ్ 'నాగ్ సర్.. సూపర్' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి ప్రతిగా 'గుడ్ ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి జగన్.. కరోనా పరిస్థితులలో సేఫ్ గా ఉండు' అని కింగ్ నాగ్ ట్వీట్ చేసారు.
Tags:    

Similar News