ప్ర‌భుత్వంతో రాసుకు పూసుకు తిరుగుతూ `ఎక‌రం` సంపాదించ‌లేరా? `మా` పెద్ద‌ల‌కు బాల‌య్య సూటి ప్ర‌శ్న‌!

Update: 2021-07-15 12:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో హుందాగా సాగాల్సిన ఎన్నిక‌ల విష‌యంలో వ‌ర్గ పోరు ర‌చ్చ‌కెక్క‌డంపై ప‌లువురు భిన్నాభిప్రాయాల్ని వ్య‌క్తమ‌వుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ వీకే న‌రేష్ ఎపిసోడ్స్ అనంత‌రం మంచు విష్ణు ప్ర‌క‌ట‌న‌లు వ‌గైరా వేడి పుట్టించాయి.

ఇక మూవీ ఆర్టిస్టుల అధ్య‌క్షుడిని ఏక‌గ్రీవం చేస్తామ‌ని ఆ మేర‌కు పెద్ద‌లంతా క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ముర‌ళీమోహ‌న్ ప్ర‌క‌టించ‌డంపైనా ఆర్టిస్టుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. సినీపెద్ద‌లు కృష్ణంరాజు- చిరంజీవి- మోహ‌న్ బాబు- ముర‌ళీమోహ‌న్ - జ‌య‌సుధ బృందం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఇదిలా ఉండ‌గానే మొన్న‌టికి మొన్న మంచు విష్ణు మా సొంత భ‌వంతి నిర్మాణానికి అయ్యే ప్ర‌తి పైసా తానే స‌మ‌కూరుస్తాన‌ని ఎవ‌రూ ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని ప్ర‌క‌టించ‌డంతో సీన్ మ‌రింత వేడెక్కింది. ఏక‌గ్రీవం చేయ‌క‌పోతేనే తాను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించి సినీపెద్ద‌ల‌ను గౌర‌వించారు విష్ణు.

ఇంత‌లోనే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ బ‌రిలో దిగారు. నాలుగు రోజులుగా కాస్త‌ స్థ‌బ్ధుగా ఉన్న త‌టాకంలో ఆయ‌న విసిరిన రాయి మ‌రో లెవ‌ల్లో క‌ల‌క‌లం సృష్టించింద‌నే చెప్పాలి. న‌ట‌సింహా ఎక్క‌డా సుత్తి లేకుండా సూటిగా అడ‌గాల్సిన‌ది అడిగేశారు.

మా అసోసియేష‌న్ కోసం ఇంతవరకు బిల్డింగ్ ఎందుకు కట్టలేక‌పోయార‌ని సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బల్డింగ్ కోసం ఓ ఎకరం భూమి సాధించలేరా? అని నిల‌దీశారు. నిధి సేక‌ర‌ణ కోసం అమెరికా వెళ్లిన స‌భ్యులు ఫస్ట్ క్లాస్ టాప్ క్లాస్ అంటూ ఫ్లైట్ లో ప్ర‌యాణించారు. ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని సూటిగా అడిగారు.

మా బిల్డింగ్ కోసం అంతా పాటుపడాలని పిలుపునిచ్చిన ఆయ‌న  భ‌వంతి నిర్మాణం విషయంలో విష్ణు ముందు తాను నిలుచుంటాన‌ని అన్నారు. అన్నివిధాలా స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని బాల‌య్య ఈ సంద‌ర్భంగా అన్నారు. లోకల్  నాన్‌ లోకల్ అంశంపై ప్ర‌స్థావిస్తూ అలాంటివి తాను ఏమాత్రం పట్టించుకోనని వివ‌ర‌ణ ఇచ్చారు.

మా బిల్డింగ్ చుట్టూనే రాజ‌కీయాలు:

గడిచిన నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్టుల సంఘంలో ర‌చ్చ పెద్ద మ‌చ్చ తెచ్చింద‌ని సినీపెద్ద‌లు న‌మ్ముతున్న సంగ‌తి తెలిసిందే. మా రాజ‌కీయాల‌న్నీ సొంత భ‌వంతి నిర్మాణం చుట్టూనే. ప్ర‌తి ఒక్క‌రూ ఆ టాపిక్ ని విడువ‌డం లేదు. ఈసారి డీసెన్సీ కోరుకున్నా అది క‌నిపించ‌లేద‌న్న ఆవేద‌న అలానే ఉంది.

మా ఎలక్ష‌న్స్ ఇటీవ‌ల మ‌రోసారి జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ మాదిరిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎంత మంది ఉన్నా ఈసారి రేస్ లో ఇద్ద‌రి మ‌ధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ - మంచు విష్ణు మ‌ధ్య కీల‌క పోటీ జ‌ర‌గ‌నుంద‌ని భావిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ దూకుడు పెంచారు. ఆయ‌న త‌న ప్యానెల్ ని అంద‌రి కంటే ముందే ప్ర‌క‌టించి ఒక మెట్టు పైనున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌కాశ్ రాజ్ వైపే చాలా మంది అసోసియేష‌న్ స‌భ్యులు మొగ్గు చూపినా మా భ‌వంతి నిర్మాణానికి ఎవ‌రూ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తానే నిర్మిస్తాన‌ని ప్రక‌టించి విష్ణు క‌ల‌క‌లం సృష్టించారు. ప‌రిశ్ర‌మ‌లో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు తీసే అత‌డికి బ‌లం పెరిగింది.

ఈసారి ఎన్నిక‌ల్లో ఒక లేడీ ని అధ్య‌క్షురాలిని చేయాల‌ని కూడా టాక్ వినిపించింది. అలా చేస్తే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు మ‌ద్ధ‌తునిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఈ ఎన్నిక‌ల్లో ఒక కోణం. ఇక ఇదే ఎన్నిక‌ల్లో తెలంగాణ ఆంధ్రా డివైడ్ అంటూ తెలంగాణ న్యాయ‌వాది కం న‌టుడు సీవీఎల్ కొత్త డిమాండ్ ని తెర‌పైకి తెచ్చి రాజ‌కీయాలు చేయ‌డంపైనా స‌ర్వ‌త్రా హాట్ డిబేట్ న‌డిచింది. తెలంగాణ - మా.. ఆంధ్రా- మా సంఘాలు కావాల‌ని ఆయ‌న అడ‌గ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.
Tags:    

Similar News