‘మనం’ సినిమాకు అన్యాయం చేశారే..

Update: 2017-11-15 05:08 GMT
నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో కొన్నింటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2014 సంవత్సరానికి ప్రకటించిన అవార్డులు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మనం’ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ‘మనం’ను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించి.. హింస పాళ్లు ఎక్కువన్న ‘లెజెండ్’ లాంటి సగటు కమర్షియల్ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించడం పట్ల కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

‘మనం’ తెలుగులో వచ్చిన ఓ అరుదైన చిత్రం. కొత్తదనం పరంగానే కాక మంచి అనుభూతిని కలిగించి.. ఎమోషనల్ గా కదిలించిన సినిమా ఇది. పైగా అక్కినేని నాగేశ్వరరావుకు ఇది చివరి చిత్రం కూడా. ఇలాంటి సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించడం ఏ రకంగా చూసినా సముచితం అంటున్నారు. ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉన్న బాలయ్య.. కొన్నేళ్లుగా వారికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఓ అవార్డుల కార్యక్రమంలో తమ మధ్య ఏమీ లేదని నాగ్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అభిప్రాయ భేదాలు తొలగిపోలేదేమో అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. ఆయన బావ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఇలాంటపుడు తమ సినిమాకు సాధ్యమైనంత ప్రాధాన్యం తగ్గించాల్సింది పోయి ఏకంగా దానికి ఏడు అవార్డులిచ్చేశారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో ‘మనం’ గొప్ప సినిమాపై వివక్ష చూపించారని అంటున్నారు.
Tags:    

Similar News