నాని ఇంత ధైర్యం చేస్తున్నాడేంటబ్బా?!

Update: 2021-10-20 13:30 GMT
ఇది వరకూ ఒక  పెద్ద సినిమా వస్తుందంటే .. దాని దరిదాపుల్లో చిన్న సినిమాలు .. ఓ మాదిరి సినిమాలు కనిపించేవి కాదు. పెద్ద సినిమాలు థియేటర్లలో నుంచి వెళ్లిపోయే వరకూ ఆ వైపు కూడా ఆ సినిమాలు తొంగి చూసేవి కాదు. కానీ చూస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. ఎవరి సినిమా వస్తే మనకేంటి?  ప్రేక్షకులు చూసేది బడ్జెట్ కాదు .. కంటెంట్ అన్నట్టుగా ఎవరు కర్చీఫ్ వేసిన చోటునవారే రిలాక్స్డ్ గా కూర్చుంటున్నారు. హీరోల్లో ఇప్పుడు ఈ నిలకడ  .. నిబ్బరం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

సంక్రాంతికి వచ్చేస్తున్నాం .. ఇక సర్దుకోండి అన్నట్టుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ సంక్రాంతి ముగ్గులు .. గొబ్బెమ్మలు చూడకుండా, హరిదాసు పాటలు వినకుండా కదిలేది లేదు అన్నట్టుగా ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మిగతా సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అంతేకాదు ఈ పండగ రోజుల్లో  కాస్త ఖాళీగా ఉండే డేట్ కనడపడితే చాలు, 'బంగార్రాజు' కూడా బరిలోకి దిగిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. తమ కథపై తమకి గల నమ్మకం కొంత, పండగ సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా చూడకుండా వదలరనే ప్రేక్షకులపై పెట్టుకున్న నమ్మకం మరికొంత.

ఇక ఇదే తీరు డిసెంబర్ మాసంలోను కనిపిస్తోంది. అల్లు అర్జున్  - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే వదిలిన పాటలు రికార్డు స్థాయి వ్యూస్ ను కొల్లగొడుతూ దూసుకుపోతున్నాయి. దసరాకి పనులు కాక .. దీపావళికి కూడా కుదరక ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలని భావించారు. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

'పుష్ప'పై ఉన్న అంచనాల కారణంగా .. ఆ సినిమా పట్ల అందరిలో ఉన్న క్రేజ్ కారణంగా, దగ్గర్లో మరో సినిమా వచ్చే ధైర్యం చేయదని అనుకున్నారు. కానీ 'శ్యామ్ సింగ రాయ్'ను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 'పుష్ప' హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 17వ తేదీన ఆ సినిమా థియేటర్లకు వస్తే, వసూళ్ల జోరు కనీసం ఓ 3వారాలపాటైనా సాగుతుంది. ఆ లోగా ఆ జోన్ లోకి వెళ్లకపోవడం ఉత్తమమనే చాలామంది అనుకున్నారు. కానీ 'శ్యామ్ సింగ రాయ్' అలా భయపడే రకం కాదు అన్నట్టుగా, ఆ తరువాత వారమే థియేటర్లకు వస్తున్నట్టుగా చెప్పేశాడు. 'పుష్ప'కున్న క్రేజు .. మార్కెట్టు .. వసూళ్ల పరంగా అది చూపించనున్న దూకుడును గురించి పట్టించుకోకుండా 'శ్యామ్ సింగ రాయ్' రంగంలోకి దిగడంతో, నానీకి ఇంత ధైర్యం ఏంటబ్బా? అనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.           
Tags:    

Similar News