రాజ‌మౌళి న‌న్ను నిరాశ‌ప‌రిచారు!- నాని

Update: 2019-07-11 05:39 GMT
ఎప్పటికీ నెర‌వేర‌ని కోరిక అని అంటారు. అలా నెర‌వేర‌దు అనుకున్న కోరిక నెర‌వేరితేనే ఆత్మకు సంతృప్తి. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానీకి అలాంటి ఆత్మ సంతృప్తి దొరికింద‌ట‌. అంత‌గా నానీకి నెర‌వేర‌ని కోరిక ఏం ఉంది? అంటే .. అత‌డు న‌టించిన `ఈగ‌` సినిమా ప్ర‌స్థావ‌న తేవాలి. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన వీఎఫ్ ఎక్స్ బేస్డ్ యానిమేటెడ్ మూవీ `ఈగ` (2012) సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాలో ఈగ (నాని)కు డ‌బ్బింగ్ చెప్పాల‌న్న కోరిక మాత్రం నెర‌వేర‌లేదని నాని అన్నారు.

తాజాగా `ది ల‌య‌న్ కింగ్` ప్ర‌మోష‌న్స్ లో నాని దీనిపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ``యానిమేష‌న్ సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్పాల‌న్న‌ది నా కోరిక‌. ప్రాజెక్టుకు సంత‌కం చేయ‌గానే అందులో ఈగ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతానేమో అనుకున్నా. కానీ రాజ‌మౌళి గారు నిరాశ‌ప‌రిచారు. అస‌లు ఈగ పాత్ర‌కు డైలాగులే ఉండ‌వు!! అని ట్విస్టివ్వ‌డంతో నిరాశ‌ప‌డ్డాను. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అది నెర‌వేర‌ని కోరికగానే ఉంది. ఇన్నాళ్టికి ది ల‌య‌న్ కింగ్ లో కీల‌క‌ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పి నెర‌వేర్చుకున్నా`` అని తెలిపారు. ఇక ఈ సినిమాకి తాను అనువాదం చెప్ప‌డానికి కార‌ణం త‌న కుమారుడే న‌ని నాని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌ద‌నుకున్న కోరికను అలా నెర‌వేర్చుకుంటున్నాడు నాని. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ డిస్నీ సంస్థ నుంచి వ‌స్తున్న‌ `ది ల‌య‌న్ కింగ్` ఈనెల 19న భార‌త‌దేశంలోని అన్ని భాష‌ల్లో రిలీజ‌వుతోంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ కి నాని- జ‌గ‌ప‌తిబాబు డ‌బ్బింగ్ చెప్పారు. త‌మిళ్ - హిందీలో ప‌లువురు ప్ర‌ముఖ స్టార్లు వాయిస్ లు అందించారు. యానిమేటెడ్ 3డి సినిమాల హ‌వా అంత‌కంత‌కు రెట్టింప‌వుతున్న ఈ ట్రెండ్ లో హాలీవుడ్ లో తెర‌కెక్కి భార‌త‌దేశంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న `ది ల‌య‌న్ కింగ్` గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్రాంతాల వారీగా స్థానిక‌త‌ను ఆపాదిస్తూ లోకల్ హీరోల వాయిస్ ఓవ‌ర్ ల‌తో `ది ల‌య‌న్ కింగ్` ప్ర‌చారం హోరెత్తించ‌డం ఈ సినిమా బాక్సాఫీస్ కి ప్ల‌స్ అవుతుంద‌నే భావిస్తున్నారంతా.
Tags:    

Similar News