దెబ్బకు అందరి థింకింగ్ మార్చేశాడుగా..!

Update: 2021-11-18 05:30 GMT
బాక్సాఫీస్ బొనాంజా నటసింహం నందమూరి బాలకృష్ణ ''అన్ స్టాపబుల్ విత్ NBK'' అనే టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన రెండు ఎపిసోడ్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

దీనికి ముఖ్య కారణం బాలయ్య అని చెప్పాలి. ఇన్నాళ్లూ వెండితెర మీద తనదైన శైలి యాక్షన్ - భారీ డైలాగ్స్ తో అలరించిన బాలయ్య.. ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని బయట పెట్టారు.

సాధారణంగా బాలకృష్ణ అంటే సీనియర్ స్టార్ హీరోగా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. బసవతారకం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలకు గానూ బాలయ్యను మంచి మనసున్న వ్యక్తిగా కొనియాడేవారు ఉన్నారు. అయితే పబ్లిక్ ఫంక్షన్స్ లో కోపగించుకోవడాలు.. అభిమానులను కార్యకర్తలను చెంప దెబ్బలు కొట్టడం వంటివి జనాల్లో అతనిని ఆవేశపరుడిగా కోపదారి మనిషిగా ప్రొజెక్ట్ చేశాయి.

బాలయ్యను దగ్గర నుంచి చూసిన వారు మాత్రం.. ఆయన గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అంటుంటారు. వెండి తెర మీద నటించినా.. నిజ జీవితంలో నటించరని.. ఆయన ముక్కుసూటితనం వల్లనే అలా అనుకుంటారని చెబుతుంటారు. కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా ఏదైనా ఉన్నది ఉన్నట్లు వెంటనే చూపిస్తారని.. భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరని బాలకృష్ణ సన్నిహితులు అనేక సందర్భాల్లో వెల్లడించారు. "అన్ స్టాపబుల్" షో చూసిన తర్వాత ఇదంతా నిజమే అనిపిస్తుంది.

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మరియు హీరో నాని లతో బాలకృష్ణ చేసిన రెండు ఎపిసోడ్స్ జనాల్లో ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు బాలయ్య అంటే ఎప్పుడూ సీరియస్‌ గా, షార్ట్‌ టెంపర్‌ గా ఉంటారని, అహంకారి అని భావించే వారందరూ.. ఎంతో ఉల్లాసంగా జోవియల్ గా మాట్లాడటాన్ని ఇష్టపడుతున్నారు. సినిమా పరిశ్రమ గురించి.. సమాజం మరియు తోటి నటీనటులకు సంబంధించిన అనేక విషయాలను గమనించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉందనేది స్పష్టం అయింది.

తనపై తాను జోక్స్ వేసుకోవడమే కాకుండా.. ఎలాంటి దాపరికం లేకుండా తన బ్రాండ్ మాన్షన్ హౌస్ గురించి చెప్పడానికి కూడా బాలయ్య వెనకాడలేదు. టాలెంట్ నున్మెచ్చుకోవడం.. తన సొంత ఫ్లాప్ ల గురించి మాట్లాడటం.. ఇతర హీరోల డైలాగ్స్ చెప్పడం.. చిన్న పిల్లాడిగా మారి ఆట్లాడటం వంటివి ఈ షోలో కనిపించాయి. నాని ని అభినందించడం.. అతని కుటుంబంతో పాటుగా అతని కొడుకు యోగక్షేమాలను కూడా అడిగిన విధానం ఆకట్టుకుంది. నిజంగా బాలయ్య తానొక సీనియర్ హీరో అనే తల బరువు.. అహంకారం ఉండి ఉంటే ఖచ్చితంగా నానితో అలాంటి స్వరంలో మాట్లాడేవాడు కాదు.

అలానే బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన చేసిన సహాయం గురించి కూడా ఈ షో ద్వారా జనాలకు తెలిసింది. బాలకృష్ణ అందరూ అనుకునే దాని కంటే భిన్నమైన వ్యక్తి అని భావించడం ప్రారంభించారు. తన చిరాకును మరియు కోపాన్ని అభిమానుల మీద చూపించి ఉండొచ్చు కానీ.. బాలయ్య లోపల చాలా సాధారణ వ్యక్తి ఉన్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అని ఆహా ప్రోమోలో బాలయ్య చెప్పినట్లు.. "అన్ స్టాపబుల్" షో వల్ల జనాల్లో ఆయన మీద ఉన్న అభిపాయాన్ని మార్చేసాడనే చెప్పాలి. నటసింహంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్న ఈ టాక్ షో.. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News