అవార్డుల్లో కైకాల‌పై ప్ర‌భుత్వాల చిన్న చూపు?!

Update: 2022-12-23 04:04 GMT
విశ్వ‌న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీఆర్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి ప్ర‌తిభావంతుడిగా న‌వ‌ర‌స‌న‌ట‌నాసార్వ‌భౌముడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు గుర్తింపు ఉంది. అంత‌టి ఫాలోయింగ్ కూడా ఆయ‌న‌కు ఉంది. కానీ ఆయ‌న 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ప‌ద్మ పుర‌స్కారం అందుకోలేక‌పోయిన ఏకైక న‌టుడిగా ఆయ‌న పేరు ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌చ్చింది.. అంటే ఆయ‌నను ప్ర‌భుత్వాలు ఎంత‌గా నెగ్లెక్ట్ చేశాయో అర్థం చేసుకోవాలి. అది తీర‌ని అన్యాయం అంటూ అప్ప‌ట్లో పద్మ అవార్డు గ్రహీతల ఎంపికపై ద‌ర్శ‌క‌రత్న డా.దాసరి నారాయ‌ణ‌రావు తీవ్ర‌ విమర్శలు గుప్పించారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం చాలా సార్లు ప్ర‌భుత్వాల‌పై దీని గురించి తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అయినా ఇప్ప‌టికీ ఆయ‌న‌కు ప‌ద్మ అవార్డు రాక‌పోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తుంది.

అంతేకాదు ప‌లుమార్లు ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాస‌రి నారాయ‌ణ‌రావు తీవ్ర విమ‌ర్శ‌ల త‌ర్వాత చివ‌రికి ఏపీ ప్ర‌భుత్వం క‌రుణించి కైకాల‌కు ప‌ద్మ పుర‌స్కారాన్ని అందిస్తుంద‌ని కూడా ప్ర‌చారం సాగింది.  కానీ అవార్డు అయితే రాలేదు. దాదాపు ఆరు ద‌శాబ్ధాలు ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లు చేసిన సీనియ‌ర్ న‌టుడు కైకాల‌కు  ప‌ద్మ పుర‌స్కారం ద‌క్క‌క‌పోయినా 15 జూన్ 2016లో మూవీ ఆర్టిస్టుల సంఘం ఆయ‌న‌ను ఘ‌నంగా స‌న్మానించుకుని సంతృప్తి ప‌డింది. దానినే కైకాల ప‌ద్మ అవార్డు ఇచ్చినంత ఆనందంగా భావించారు.

అప్ప‌ట్లోనే  జమున లాంటి సీనియ‌ర్ న‌టీమ‌ణితో పాటు వెట‌ర‌న్ న‌టుడు కైకాల సత్యనారాయణలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఘ‌నంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సంద‌ర్భంలో ఆయన మాట్లాడుతూ.. సరైన ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం లేదని విమర్శించారు.

టాలీవుడ్ లో జమున- సత్యనారాయణ లాంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం సరైన వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వడం లేదు. అవి సినిమా పరిశ్రమకు పెద్దగా ఏమీ చేయని అనర్హులకు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అవార్డులు చాలా చౌకబారుగా మారాయి`` అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

జమున- సత్యనారాయణ- ఎస్‌.వి.ఆర్ వంటి ఎందరో సీనియర్‌ ఆర్టిస్టులు... సావిత్రి- అంజలీ దేవి వంటి ప్ర‌తిభావంతులు ప్రభుత్వం నుండి ఎటువంటి అవార్డులు పొందలేదని ... పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారు అంటూ తీవ్ర స్వ‌రంతో ద‌ర్శ‌క‌ర‌త్న‌ దాసరి నారాయ‌ణ‌రావు అప్ప‌ట్లో ఫైర‌య్యారు.

నిజానికి దాస‌రిలా గొంతు వినిపించేవారు లేక‌పోతే కైకాల స‌త్య‌నారాయ‌ణ వంటి సీనియ‌ర్ల‌కు ఆమాత్రం గుర్తింపు కూడా ద‌క్కేది కాదు. ప‌ద్మ పుర‌స్కారం స‌హా ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల‌కు కైకాల అర్హుడు. కానీ ప్ర‌భుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కైకాల‌కు 2011లో ప్ర‌తిష్ఠాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. 2017లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News