డబ్బులిచ్చి ఒకరు.. డబ్బులివ్వక మరొకరు ట్రోల్ అవుతున్నారు

Update: 2022-01-25 13:44 GMT
నరం లేని నాలుక ఏమైనా అంటుందంటే ఇదేనేమో? ఒకే విషయంలో ఇద్దరు సెలబ్రిటీలు వేర్వురుగా స్పందించటం.. ఆ రెండింటిని నెటిజన్లు తిట్టిపోయటం చూస్తే.. మరేం చేయాలి నాయనా? అన్న సందేహం కలుగక మానదు. ఒకే సమయంలో బయటకు వచ్చిన రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆసక్తికరంగా రెండూ ఒకేలాంటి సన్నివేశాలు. సెలబ్రిటీలు కూడా ప్రముఖులే. కానీ.. వారు రియాక్టు అయిన తీరే భిన్నం. అయినప్పటికి ఈ ఇద్దరిని విడిచిపెట్టని నెటిజన్ల తీరు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ జరిగిందేమంటే..

పుష్ప మూవీతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు జత కట్టిన రష్మిక కూడా.. ఈ సినిమా పుణ్యమా అని అందరినోట్లో నానారు. ఈ సినిమాలో ఆమె చేసింది డ్రీగ్లామర్డ్ పాత్రే అయినప్పటికీ.. ఆమె నటన ఆకట్టుకునేలా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీ చేస్తున్న రష్మిక.. షూటింగ్ ముగించుకొని బయటకు వచ్చింది. కారు ఎక్కే లోపు.. ఆమెను చుట్టూ చేరిన వీధి బాలలు.. తమకు సాయం చేయాలని కోరారు. అయితే.. తన దగ్గర డబ్బులు లేవన్న ఆమె.. ఎలాంటి సాయం చేయకుండానే కారు ఎక్కేశారు. దీంతో.. ఆమెపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

వీధి పిల్లలు సాయం అడిగితే ఆ మాత్రం సాయం చేయవా? పట్టనట్లు వెళ్లిపోతారా? అంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినోళ్లంతా ట్రోల్ చేస్తున్నారు. కట్ చేస్తే.. మరో వైరల్ వీడియోలో ప్రముఖ సింగర్ నేహా కక్కర్ కారులో ఉండగా.. ఆమెను సాయం చేయాలంటూ కొందరు వీధి బాలలు ఆమె కారు వద్దకు వస్తే.. రూ.500 నోట్ల కట్ట పట్టుకొని.. ఒక్కొక్కరికి ఒక్కో నోటు ఇవ్వటం మొదలు పెట్టారు.

రూ.500 నోటు చొప్పున ఇవ్వటం.. దాన్ని చూసిన ఆమె కారు వద్దకు పెద్ద ఎత్తున రావటం.. చేతులు లోపలకు పెట్టేసిన వైనంతో ఆమె ఒక్కసారిగా బెదిరిపోయారు. కాస్త వెనక్కి తగ్గారు. విండో గ్లాస్ మూసేసుకొని వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై నెటిజన్లు రియాక్టు అవుతూ.. సాయం చేసే తీరు ఇదేనా? ఇలా చేయటం సరికాదు. కాసింత జాగ్రత్తలు తీసుకోనక్కర్లేదా? అంటూ మండిపడ్డారు. రష్మిక డబ్బులు ఇవ్వనందుకు తిడితే.. నేహా డబ్బులిచ్చినందుకు తిట్టిపోస్తున్న తీరు చూస్తే.. నెటిజన్ల మనసుల్ని సమాధానపర్చటం మామూలు విషయం కాదు సుమి అనకుండా ఉండలేం.

Full View
Tags:    

Similar News