'నేనే వస్తున్నా' టీజర్: అటు హీరోగా ఇటు విలన్ గా సర్ప్రైజ్ చేసిన ధనుష్..!

Update: 2022-09-15 13:51 GMT
టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న కోలీవుడ్ హీరోలలో ధనుష్ ఒకరు. తాను నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేస్తూ ఇక్కడ కూడా విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలో 'సార్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా చేస్తున్నాడు. అయితే అంతకంటే ముందుగా ఇప్పుడు ''నేనే వస్తున్నా'' అంటూ డబ్బింగ్ తో వస్తున్నాడు ధనుష్.

ధనుష్ హీరోగా తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నానే వరువేన్'. తెలుగులో ఈ చిత్రాన్ని ''నేనే వస్తున్నా'' అనే పేరుతో విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'నేనే వస్తున్నా' సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు హీరోగా కనిపిస్తే.. మరొకరు విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఒకరు తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే.. ఇంకో పాత్ర అడవుల్లో తిరుగుతూ మర్డర్స్ చేస్తున్నాడు. అయితే వీరిద్దరికీ ఏదో కనెక్షన్ ఉన్నట్లు.. ఇద్దరి మధ్య వైరం ఏర్పడినట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది.

ధనుష్ రెండు పాత్రల గెటప్స్ మరియు యాక్టింగ్ లో వైవిధ్యం చూపించాడు. ఇందులో సెల్వరాఘవన్ కూడా కీలక పాత్రలో నటించారు. అతని గెటప్ డిఫరెంట్ గా ఉంది. ఇద్దరు ధనుష్ లకు జోడీగా ఇందూజ రవిచంద్రన్ - గ్రీకు నటి షెల్లీ కిషోర్ కనిపించారు. యోగి బాబు - ప్రభు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్ లో కథేంటినేది రివీల్ చేయకుండా ఎలాంటి డైలాగ్స్ లేకుండా చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. యువన్ శంకర్ రాజా సమకూర్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. భువన్ శ్రీనివాసన్ దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'నేనే వస్తున్నా' సినిమాకి ధనుష్ మరియు సెల్వ రాఘవన్ కలిసి కథ అందించారు. దాదాపుగా పదకొండేళ్ల విరామం తరువాత అన్నదమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగానే లేటెస్టుగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2022 సెప్టెంబర్ లోనే ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల 'తిరు' తో బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్.. ''నేనే వస్తున్నా'' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News