టాలీవుడ్ లో ఉన్న నెపోటిజం సంగతేంటి...?

Update: 2020-06-27 11:30 GMT
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం, ఫేవరిజమ్, వారసత్వం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు.. చిత్ర పరిశ్రమ ప్రారంభ దశ నుండి ఉన్నవే. అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ వ్యవహారంతో ఈ అంశంపై ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్.. వాళ్లను నడిపించే సినీ ప్రముఖులు ఒక మాఫియాలా తయారై రియల్ టాలెంట్‌ ను తొక్కేస్తున్నారని.. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ లాంటి స్టార్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

కాగా నెపోటిజం అనేది ఒక్క సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. వ్యాపారం రాజకీయ రంగాలతో పాటు ప్రతీ దాంట్లో బంధుప్రీతి అనేది ఉండేదే. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుండి సౌత్ ఇండస్ట్రీలలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మన టాలీవుడ్ విషయానికొస్తే ఇక్కడ బహిరంగంగా ఎవరూ కామెంట్ చేయకపోయినా పలువురు హీరోలు దీనిపై డిస్కస్ చేసుకుంటున్నారట. నిజానికి మిగతా ఇండస్ట్రీలలో కంటే టాలీవుడ్ లో ఈ నట వారసత్వం అనేది ఎక్కువనే చెప్పొచ్చు. నందమూరి తారక రామారావు నటవారసులుగా బాలకృష్ణ - హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కొంతమంది నిర్మాతలుగా మారి ఇండస్ట్రీలోకి వచ్చారు. నెక్స్ట్ జెనరేషన్ లో ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ - తారకరత్న వచ్చారు. త్వరలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా రానున్నాడు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా అక్కినేని నాగార్జున - వెంకట్ ఇండస్ట్రీలో ఒకరు హీరోగా ఒకరు నిర్మాతగా అడుగుపెట్టారు. వీరి తర్వాతి తరంలో సుమంత్ - సుప్రియ - నాగ చైతన్య - అఖిల్ - సుశాంత్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. వీరి తర్వాత మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ఇప్పటి వరకు డజను మంది ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయిధరమ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - నిహారిక - వైష్ణవ్ తేజ్ - అల్లు బాబీ వంటి వారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక దగ్గుబాటి రామానాయుడి వారసులుగా వెంకటేష్ - సురేష్ బాబు - రానా టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నారు. ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ నుండి రమేష్ బాబు - మహేష్ బాబు - సుధీర్ బాబు - మంజుల తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈక్రమంలో కృష్ణ మనవడు అశోక్ గల్లా కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.

వీరితో పాటు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ కి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తనయులు చాలా మందే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాకుండా వీరి సపోర్ట్ చూసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారు కూడా కోకొల్లలు ఉన్నారు. అయితే వీరిలో కొందరు తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇకపోతే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవితేజ గురించి. కానీ రవితేజ ని నమ్ముకొని అతని తమ్ముళ్లు కూడా సినీ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యారు. ఇక ఈ జనరేషన్ హీరోలలో నాని - శర్వానంద్ - నిఖిల్ సిద్దార్థ్ వంటి వారు కష్టపడి పైకొచ్చి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

నిజానికి వారసత్వంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారికి అది ఫస్ట్ సినిమాకి మాత్రమే హెల్ప్ అవుతుంది. తర్వాత సినిమా నుండి సొంత టాలెంట్ చూపించి ఇంప్రెస్ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో కనుమరుగై పోయారు. ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తేనే ఏ నట వారసుడైనా స్టార్ హీరోగా నిలదొక్కుకోగలడు అన్నది నిజం. సగటు ప్రేక్షకుడు వారిని ఆదరించినంత వరకు ఎన్ని డిస్కషన్స్ పెట్టినా నెపోటిజం ఉంటుంది అనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.
Tags:    

Similar News