బాహుబ‌లి డిజిట‌ల్ వార్‌.. ఎవ‌రికి లాభం?

Update: 2018-08-08 05:58 GMT
అమెజాన్ - హాట్‌ స్టార్‌ కి నెట్‌ ఫ్లిక్స్ ఎర్త్ పెడుతుందా?  బాహుబ‌లి వెబ్ సిరీస్‌ తో నెట్‌ ఫ్లిక్స్ టార్గెట్ ఏంటి? ప‌్ర‌స్తుతం డిజిట‌ల్ వ‌రల్డ్ స‌హా సినిమా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. డిజిట‌ల్ స్ట్రీమింగ్ మీడియాలో `గేమ్స్ ఆఫ్ థ్రోన్స్‌` పెను సంచ‌ల‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సిరీస్‌ కి వీరాభిమానులున్నారు. ఈ ఫ్రాంఛైజీని అంత‌కంత‌కు పెంచుకుంటూ పోతున్నారు. ప్రీక్వెల్స్ - సీక్వెల్స్ అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌లు పుట్టించి విజువ‌లైజ్ చేసి - ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల్ని యంగేజ్ చేసుకోవ‌డంలో వీళ్ల స్ట్రాట‌జీ పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. ఈ మార్కెట్ ఎంతో విస్తృతమైన‌ది. అందుకే డిజిట‌ల్ వేదిక‌పై ప్ర‌స్తుతం ర‌ణ‌యుద్ధం సాగుతోంది. ఒక డిజిట‌ల్ చానెల్‌ ని మించి ఇంకో డిజిట‌ల్ చానెల్ రెచ్చిపోతూ వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌ను విసిరేస్తున్నాయి. నెట్‌ ఫ్లిక్స్ ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మ చానెళ్ల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది.

రీసెంటుగానే రాజ‌మౌళి- దేవ‌క‌ట్టా బృందంతో నెట్‌ఫ్లిక్స్ బాహుబ‌లి వెబ్ సిరీస్ కోసం భారీ ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి సినిమాల‌కు ద‌క్కిన‌ ప్ర‌చారంతో ఈ వెబ్ సిరీస్‌ ని పెద్ద స‌క్సెస్ చేయాల‌ని నెట్‌ ఫ్లిక్స్ మార్కెటింగ్ వ‌ర్గాలు భారీ ప్లాన్‌ తో ఉన్నాయిట‌. అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస‌వుతుంది? ఇదివ‌ర‌కూ అమెజాన్‌ తో క‌లిసి రాజ‌మౌళి బృందం బాహుబ‌లి కార్టూన్ యానిమేటెడ్ సిరీస్ `బాహుబ‌లి- ది లాస్ట్ లెజెండ్స్‌`ని ర‌న్ చేసింది. కానీ అదేమంత పెద్ద స‌క్సెస‌వ్వ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ కొత్త ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌ల‌మ‌వుతుందో అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ కొత్త ఛాలెంజ్‌ ని రాజ‌మౌళి బృందం ప్రాక్టిక‌ల్‌ గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

ఎవ‌రేం చేసినా వీళ్లంతా చెప్పేది ఒక్క‌టే. భార‌తీయ పురాణేతిహాసాల్లో అద్భుత‌మైన క‌థ‌లు ఉన్నాయి. వీటిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే అరుదైన వేదిక డిజిట‌ల్ ప్లాట్‌ ఫాం. ఇక్క‌డ మ‌న క‌థ‌ల్ని వ‌ర్క‌వుట్ చేయొచ్చు అని చెబుతున్నారు. అలానే బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర పెద్ద స‌క్సెస్‌. అందుకే ఈ పాత్ర పేరుతోనే `ది రెయిజ్ ఆఫ్ శివ‌గామి` ఎపిసోడ్స్‌ పై వెబ్ సిరీస్‌ ని తెర‌కెక్కిస్తున్నారు. ఇది `బాహుబ‌లి- ది లాస్ట్ లెజెండ్స్‌` కంటే ఎన్నో రెట్లు భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కుతున్న సిరీస్ కావ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది. ఇది అమెజాన్ - హాట్‌ స్టార్‌ లకు పోటీనిచ్చేదిగా ఉంటుందా? అన్న‌ది చూడాలి.

ఇదొక్క‌టే కాదు.. వెబ్‌ సిరీస్‌ ల వెల్లువ‌లో.. మ‌హాభార‌తం లాంటి గొప్ప పురాణేతిహాసాన్ని డిజిట‌ల్ ప్లాట్‌ ఫాంపై తెర‌కెక్కిస్తే ఇంత‌కంటే పెద్ద స‌క్సెస్ సాధ్య‌మేన‌ని రాజ‌మౌళి స‌హా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎవ‌రేం చేసినా ఇలా డిజిట‌ల్ వేదిక అభివృద్ధి వ‌ల్ల న‌వ‌త‌రం ట్యాలెంటుకు బోలెడ‌న్ని అవ‌కాశాలొస్తున్నాయి. ఇన్నాళ్లు కేవ‌లం సినిమా- టీవీనే న‌మ్ముకున్న ద‌ర్శ‌కులు - ర‌చ‌యిత‌లు - న‌టీన‌టులు - ఇతర‌త్రా ట్యాలెంటుకు అవ‌కాశాల విస్త్ర‌తి పెరిగింది. కృష్ణాన‌గ‌ర్‌ లో కొబ్బ‌రి నూనె రాసుకుని ఖాళీగా కూచున్న చాలామందికి కాస్తంత స్కిల్ ఉన్నా అసిస్టెంట్లుగా అవ‌కాశాలిచ్చేందుకు ఈ వెబ్ సిరీస్‌ల‌లో ఛాన్స్‌ ఎక్కువ క‌నిపిస్తోంద‌ని పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ ట్రైన్డ్ యంగ్ డైరెక్ట‌ర్ ఒక‌రు విశ్లేషించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News