రోజులో ఎదురైన రెండు అనుభవాల్ని చెప్పిన క్యూట్ భామ

Update: 2022-04-07 04:21 GMT
పల్చగా.. నాజూగ్గా ఉండే హీరోయిన్లు కాస్త తక్కువనే చెప్పాలి. అలాంటి సన్నజాబి మొగ్గలు అప్పుడప్పుడు వెండితెర మీద తళుక్కుమంటుంటారు. ఆ కోవలోకే వస్తుంది  శ్రద్ధా శ్రీనాథ్. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీలో అతడికి జత కట్టిన ఆమె.. మోడ్రన్ గానే కాదు.. హోమ్లీగానూ కనిపించి తన అందంతోనూ.. అభినయంతోనూ ఆకట్టుకుంది.

చూసినంతనే మనసులో రిజిస్టర్ అయ్యే అందంతో ఈ బ్యూటీకి తెలుగులో వచ్చిన అవకాశాలు కాస్త తక్కువే. చేసిన మరో రెండు సినిమాలు ఓటీటీకే పరిమితం కావటం.. మిగిలిన దక్షిణాది భాషల్లో బిజీగా ఉండటంతో తెలుగులో ఛాన్సులు రాలేదన్న కొరత అమ్మడికి లేదనే చెప్పాలి.

తాజాగా ఒక సినిమా షూట్ ను పూర్తి చేసుకొని ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు ఎదురైన రెండు అనుభవాల గురించి ఆమె తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అందులో మొదటిది ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే వేళలో ఓలా క్యాబ్ బుక్ చేసుకోవటం.. క్యాబ్ లోకి ఎక్కిన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేయకపోవటాన్ని ప్రస్తావించింది. ఏసీ గురించి అడిగితే నో చెప్పాడని పేర్కొంది. పెట్రోల్ ధరలు పెరగటంతో ఏసీ ఆన్ చేసేందుకు నో చెప్పాడన్న ఆమె.. తను చేసిన పొదుపుతో డబ్బు కొంత ఆదా అవుతుందన్న విషయాన్ని వెల్లడించింది.

ఈ కారణంతోనే తాను అతన్ని ఏమని అనలేదన్న ఆమె.. నాలుగు రూపాయిలు ఎక్కువ ఇస్తాను.. ఏసీ ఆన్ చేయమని మాత్రం అడగకపోవటం గమనార్హం. డ్రైవర్ల కష్టాన్ని ఓలా క్యాబ్ సంస్థ దోచుకుంటుందన్న విషయాన్ని ప్రస్తావించింది. క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి చెమటలు పట్టినా.. ఆ బక్క జీవి మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. ఓలా సంస్థను నిందించటం గమనార్హం. ఇంత చేసినప్పటికీ.. తాను ఇవ్వాల్సిన చార్జీ కంటే కాసింత ఎక్కువ ఇవ్వకుండా ఉన్న వైనాన్ని చూస్తే.. అమ్మడు డబ్బు దగ్గర చాలా జాగ్రత్త అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇక.. ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన మరో అనుభవం గురించి చెప్పుకొచ్చింది. తానుఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు అక్కడి సిబ్బంది ఒకడు తనను గుర్తించి.. తన సోషల్ మీడియా అకౌంట్ ను ఓపెన్ చేసి.. తనను ఫాలో కావాలని కోరినట్లు పేర్కొంది. అయితే.. తాను మాత్రం సున్నితంగా రిజెక్టు చేయగా.. సదరు వ్యక్తి.. మీరు ఫాలో కాకున్నా.. నేను మిమ్మల్ని ఫాలో అయి.. మీకు సపోర్టు చేస్తానని చెప్పినట్లుగా పేర్కొంది.

ఒక బక్కజీవి నోరు తెరిచి అభిమానంతో అడిగినప్పుడు.. ఫాలో అయితే పోయేదేముంది? మహా అయితే అతగాడికి కాస్తంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇదంతా చూసినప్పుడు విషయాల్ని అందరికి షేర్ చేసే విషయంలో ఉన్న పెద్ద మనసు.. రియల్ లైఫ్ లో ఎదురయ్యే ఉదంతాల్ని తాను ఎంత ప్రాక్టికల్ గా చూస్తుందన్న విషయాన్ని తన మాటలతో.. చేతలతో స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News