టాలీవుడ్ కు కొత్త క(థ)ళ వచ్చింది..

Update: 2018-11-02 17:30 GMT
ఆరు పాటలు.. మూడు ఫైట్లు.. కాసింత సెంటిమెంట్.. ఇదే మొన్నటివరకు తెలుగు సినిమా హిట్ ఫార్ములా.. కానీ ఎన్నాళ్లని చూస్తాం.. ప్రేక్షకులు మారారు. హీరో కొడితే విలన్లు గాల్లో లేచిపోయే సీన్లను తిరస్కరిస్తున్నారు. నేచురల్ గా ఉండాలి.. అది మన దైనందిన జీవితంలో భాగమై ఉండాలి. అప్పుడే ఆ కథను ఆదరిస్తున్నారు. బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. ఈ మూస ఫార్ములా నుంచి బయటకు రాకే చాలా మంది సీనియర్ దర్శకులు తెరమరుగయ్యారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ మారింది..తెలుగు సిని పరిశ్రమలో కొత్త క(థ)ళ వచ్చింది.. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు  - వాటి విజయాలను చూస్తే అదే అనిపిస్తోంది..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దశ దిశ మారింది. కొత్త కథలను జనం నెత్తిన పెట్టుకుంటారని అర్థమైంది. కొత్తగా ఆలోచించేవారెవరికైనా సరే ఆదరణ ఉంటుందని నిరూపితమైంది. అందుకే ఆ తర్వాత వచ్చిన నిజజీవిత కథ ‘ఆర్ ఎక్స్ 100’ ఊహించని విజయాన్ని అదుకుంది. రికార్డు కలెక్షన్లతో దుమ్ము దులిపింది. అస్సలు ఎవ్వరూ ఊహించని ప్రాంతీయ చిత్రం ‘కంచెరపాలెం’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి మనసు దోచేసింది. సినిమాలు ఇలా కూడా తీయొచ్చా అని అబ్బురపడేలా చేసింది.  అదే కాదు.. ఇటీవల కాలంలో వచ్చిన గూడచారి - మహానటి - రంగస్థలం - తొలిప్రేమ - గురుడవేగ - ఆనందోబ్రహ్మ - రాజుగారి గది హిట్ కొట్టాయి. కొత్త కథతో తీసిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపితమైంది..

తాజాగా ఈ కొత్త కథలను కొత్త దర్శకులు తెరపైకి తీసుకొస్తున్నారు. ‘ఘాజీ’తో హిట్ కొట్టిన సంకల్ప్ ‘అంతరిక్షం’ పేరుతో అద్భుతమే ఆవిష్కరిస్తున్నాడు. ఇక చిన్న సినిమా ‘ఏడు చేపల కథ’... మరో అర్జున్ రెడ్డి - ఆర్ ఎక్స్ 100లా సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. కంటెంట్ మొత్తం రోమాన్స్ తో నిండినా అందులో పాయింట్లు మాత్రం ఆసక్తి రేపుతోంది.

త్వరలో టాలీవుడ్ లో వచ్చే  విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’.. ప్రియదర్శి - రాహుల్ హీరోలుగా ‘మిఠాయ్’ - నిఖిల్ ‘ముద్ర’ - రవిబాబు ‘అదుగో’ కూడా విభిన్న కథలతో వస్తున్న సినిమాలే..  ఇలా కొత్త దర్శకులు.. కొత్త కథలకు ఊపిరిపోస్తూ తమ కళలను తెరపై ఆవిష్కరిస్తూ అద్భుతాలే సృష్టిస్తున్నారు. ఆ కొత్త ఒరవడిని ప్రేక్షకులు ఆస్వాదిస్తూ హిట్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కు కొత్త కథలతో కొత్త కళే వచ్చింది.
Tags:    

Similar News