మల్టీస్టారర్‌ లో ఎన్టీఆర్‌ పాత్ర పై మరో పుకారు

Update: 2018-12-18 04:54 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మల్టీస్టారర్‌ మూవీ ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక వార్త మీడియా లో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. సంవత్సర కాలంగా ఎన్టీఆర్‌- చరణ్‌ ల మల్టీస్టారర్‌ మూవీ గురించి మీడియా లో కొన్ని వందల రకాల పుకార్లు షికార్లు చేశాయి. భారీ అంచనాల నడుమ దర్శకుడు రాజమౌళి ఇటీవలే మల్టీస్టారర్‌ మూవీ చిత్రీకరణ ప్రారంభించాడు. మొదటి షెడ్యూల్‌ ను అయితే పూర్తి చేశాడు కాని సినిమా కు సంబంధించిన చిన్న క్లూ కూడా బయటకు రానివ్వలేదు.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మల్టీస్టారర్‌ లో రామ్‌ చరణ్‌- ఎన్టీఆర్‌ లు హీరో గా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు, దానయ్య నిర్మిస్తున్నాడు అనే విషయాలు తప్ప మరే విషయం ఇప్పటి వరకు అదికారికంగా బయటకు రాలేదు. కాని మీడియా లో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి, చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పాత్ర గురించి తెగ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌ పాత్ర ఈ చిత్రం లో చాలా విభిన్నంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ తన బాడీని పెంచడంతో పాటు, కొత్త మేకోవర్‌ లో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్‌ గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్‌ లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ముస్లీం యువకుడిగా కనిపిస్తాడని, బంది పోటు పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. స్వాతంత్య్రం కు పూర్వం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. రామ్‌ చరణ్‌ బ్రిటీష్‌ పోలీస్‌ గా కనిపిస్తాడట. ఇక రామ్‌ చరణ్‌ కు ఈ చిత్రంలో బాబాయి పాత్రలో తమిళ నటుడు సముద్రఖని కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రం కు సంబంధించిన ఏదో ఒక వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో రాజమౌళి నోరు విప్పితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒక వేళ ఈ వార్త నిజం అయితే మాత్రం నందమూరి అభిమానులకు పెద్ద సర్‌ ప్రైజ్‌ గా చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News