అల్లు అర‌వింద్ వైజాగ్ లో ఫిలింఇనిస్టిట్యూట్ నిర్మిస్తారా?

Update: 2022-04-04 03:07 GMT
ఏపీ - తెలంగాణ డివైడ్ అనంత‌రం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఎటు వెళుతుంది? అన్న చర్చ సాగింది. కానీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లోనే ఉండేందుకు అవ‌స‌ర‌మైన భ‌రోసానిస్తూ కేసీఆర్- కేటీఆర్ ప్ర‌భృతులు చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఇండ‌స్ట్రీ ఎటూ క‌ద‌ల‌ని మాట వాస్త‌వం.  అయితే తెలుగు సినీప‌రిశ్ర‌మ కు ఇటీవ‌లి కాలంలో ప్ర‌భుత్వాల ప‌రంగా ఎలాంటి స‌హ‌కారం ల‌భించింది. చేసిన వాగ్ధానాలు అమ‌ల‌య్యాయా? అంటే అంతా శూన్యం అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఏపీ తెలంగాణ డివైడ్ అనంత‌రం తెలంగాణ‌లో పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ని వేగంగా నిర్మిస్తామ‌ని కేసీఆర్ - కేటీఆర్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. కానీ అది జ‌ర‌గ‌లేదు.

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో ఫిలింఇండ‌స్ట్రీని అభివృద్ధి చేస్తామ‌ని స్టూడియోలు నిర్మించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన మ‌హా నేత‌ల క‌ల‌లు క‌ల్ల‌లుగా మారాయి. ఇప్ప‌టికీ దీనికి సంబంధించిన పునాది రాయి కూడా ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక‌పోతే ఏపీలో రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి చిక్కుముడి వీడ‌క‌పోవ‌డంతో ఇత‌ర ప‌రిశ్ర‌మల అభివృద్ధి కుంటుప‌డిన మాట వాస్త‌వం. ఆర్థికంగానూ ఏపీ ప‌రిస్థితి తీసిక‌ట్టుగా ఉంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయితే ఏపీలో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని సినీపెద్ద‌ల‌ను ఆహ్వానించారు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి- నాగార్జున వంటి పెద్ద‌లు దీనిపై మంత‌నాలు సాగించారు. రెండేళ్ల క్రితం ఉగాది ఫ‌ర్వ‌దినాన ఏపీ లో తెలుగు సినీప‌రిశ్రమ అభివృద్ధి గురించి మంత్రి అవంతీ శ్రీ‌నివాస్ ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. కానీ ఆ త‌ర్వాత ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ప‌లుమార్లు సీఎం మ‌న‌సులో సినీప‌రిశ్ర‌మను వైజాగ్ లో అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న‌కు సంబంధించిన మాట‌ను అవంతి నోట ప్ర‌జ‌లు విన్నారు.

ఇంత‌లోనే ఇటీవ‌ల ఆయ‌న తెలుగు సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి సంబంధించి మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ `గ‌ని` ప్రీరిలీజ్ వేడుక‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతీ శ్రీ‌నివాస్ .. వైజాగ్ లో ఫిలింఇనిస్టిట్యూట్ ని నిర్మించాల‌ని అగ్ర‌నిర్మాత‌.. బాస్ అల్లు అర‌వింద్ ని కోరారు. ఫిల్మ్ స్ట‌డీస్ కి సంబంధించి కాలేజ్ క్యాంప‌స్ ఏర్పాటు చాలా అవ‌స‌ర‌మ‌ని కూడా ప్ర‌స్థావించారు.  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఔట‌ర్ లో త‌మ స్వంత స్థ‌లంలో భారీ ఫిలింస్టూడియోని నిర్మిస్తున్న అల్లు అర‌వింద్ విశాఖ‌ప‌ట్నంలో కూడా ఒక ఫిలింస్టూడియోని నిర్మించే ఆలోచ‌న‌న‌లో ఉన్నారని ఇంత‌కుముందు టాక్ వ‌చ్చింది. కానీ దానిపై ఇటీవ‌ల స్ప‌ష్ఠ‌త క‌రువ‌డింది. అయితే క‌నీసం ఫిలింఇనిస్టిట్యూట్ ని నిర్మించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ త‌న సేవ‌ల్ని విస్త‌రించాల‌ని మంత్రి వ‌ర్యుల‌తో పాటు సినీఅభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి- అర‌వింద్ ద్వ‌యం ఫిలింస్టూడియోలు.. ఫిలింఇనిస్టిట్యూట్ లు నిర్మిస్తే ఏపీలోనూ సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి దారులు తెరుచుకున్న‌ట్టు అవుతుంద‌ని ఆశిస్తున్నారు. దీనిపై సినీపెద్ద‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఆలోచ‌న‌లు ఏమిట‌న్న‌ది ప్ర‌స్తుతానికి వెయిట్ అండ్ వాచ్..
 
గ‌ని రేంజు ఆ లెవ‌ల్లో ఉంది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ- రినైసేన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద- అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది.

ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయ‌ని తెలుస్తోంది. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు- సునీల్ శెట్టి-, ఉపేంద్ర- నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు
Tags:    

Similar News