ఈద్ వీకెండ్ లోనూ బొక్కబోర్లాపడ్డ బాలీవుడ్ స్టార్స్..!

Update: 2022-05-01 03:30 GMT
కోవిడ్-19 పాండమిక్ తర్వాత సినీ ఇండస్ట్రీ ఎప్పటిలాగే పుంజుకొని సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. బిజినెస్ ట్రాక్ లోకి రావడంతో.. మేకర్స్ అందరూ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. దీంతో ఇంతకముందు మాదిరిగానే వారానికో రెండు మూడు క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి.

అయితే 2022 లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలను పరిశీలిస్తే.. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధిస్తుంటే.. మరోవైపు బాలీవుడ్ చిత్రాలు కనీస వసూళ్ళు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయనేది స్పష్టమవుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' మరియు 'కేజీయఫ్: చాప్టర్ 2' సినిమాలు నార్త్ సర్క్యూట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఒకటి రూ. 265 కోట్లకు పైగా వసూలు చేస్తే.. మరొకటి రూ. 350+ కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అదే సమయంలో ఏ ఒక్క బాలీవుడ్ సినిమా కూడా భారీ వసూళ్లు అందుకోలేకపోయింది.

అలియా భట్ నటించిన 'గంగూబాయి కతీయావడి' సినిమా టాక్ బాగానే ఉన్నా లాంగ్ రన్ లో వసూళ్ళుగా మలుచుకోలేకపోయింది. జాన్ అబ్రహాం 'ఎటాక్-1' మరియు అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఇటీవల వచ్చిన షాహిద్ కపూర్ 'జెర్సీ' సినిమా పరాజయం చవిచూసింది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ కు బాగా కలిసొచ్చే ఈద్ సీజన్ ను నమ్ముకొని అజయ్ దేవగన్ - టైగర్ ష్రాఫ్ వంటి ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. 'రన్ వే 34' మరియు 'హీరోపంతి 2' సినిమాలు నిన్న శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రె రెండు చిత్రాలకు కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి.

అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ - రకుల్ ప్రీత్ సింగ్ లతో తెరకెక్కించిన సినిమా ''రన్ వే 34''. ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఏమంత బజ్ క్రియేట్ చేయలేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే ఉన్నాయి.

మరోవైపు 'హీరోపంటి' చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన 'హీరోపంటి 2' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇది టైగర్ ష్రాఫ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలుస్తుందని అంటున్నారు. ఒకింత దీని కంటే 'రన్వే 34' సినిమా కాస్త బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈద్ ను టార్గెట్ చేస్తూ రెండు హిందీ సినిమాల ఓపెనింగ్ లెక్కలు చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు విశ్లేషకులు షాక్ అవుతున్నారు. దీంతో ఈ రంజాన్ సీజన్ బాలీవుడ్ కు కలిసి రాలేదని అంటున్నారు.

అదే సమయంలో డబ్బింగ్ సినిమా 'కేజీఎఫ్ 2' సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోనూ ప్రదర్శించబడుతోంది. ఈద్ వీకెండ్ లో బాలీవుడ్ బిగ్గీలను డామినేట్ చేసి సూపర్-స్ట్రాంగ్ గా నిలబడుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వారం కూడా బాలీవుడ్ లో డిజాస్టర్స్ ట్రెండ్ కొనసాగిందని అర్థం అవుతోంది.
Tags:    

Similar News