నా బ్యానర్లో బాబాయ్ తో సినిమా ఉంటుంది

Update: 2021-11-23 03:54 GMT
తెలుగులో వెబ్ సిరీస్ ల జోరు అంతగా అందుకోకముందే, నిహారిక వెబ్ సిరీస్ లు చేసింది. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ పై ఆమె 'ముద్దపప్పు ఆవకాయ' .. ' నాన్న కూచి' అనే వెబ్ సిరీస్ లను నిర్మించింది .. వాటిలో ప్రధానమైన పాత్రలను పోషించింది. ఆ తరువాత కథానాయికగా కూడా తన ముచ్చట తీర్చుకున్న ఆమె, వివాహం తరువాత మళ్లీ వెబ్ సిరీస్ ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. తన బ్యానర్ లో 'ఒక చిన్నఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. సంగీత్ శోభన్ .. నరేశ్ .. తులసి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ కి మహేశ్ దర్శకత్వం వహించాడు.

ఈ నెల 19వ తేదీ నుంచి జీ 5లో ఈ వెబ్ సిరీస్ నడుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను మరింతగా జనంలోకి తీసుకువెళ్లడం కోసం నిహారిక తన టీమ్ తో కలిసి ప్రయత్నిస్తూనే ఉంది. తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, తనకి ఈ కథ బాగా నచ్చడం వల్లనే ముందుకు వెళ్లినట్టుగా చేప్పింది. ఒక సినిమా కోసం ఎంతగా కష్టపడతమో .. ఈ వెబ్ సిరీస్ కోసం తాము అంతగా కష్టపడ్డామని అంది. అలాగే ఈ కథతో సినిమా తీస్తే ఎంత ఖర్చు అవుతుందో, వెబ్ సిరీస్ చేయడం వలన కూడా అంతే ఖర్చు అయిందని చెప్పింది.

తన టీమ్ లో ఎవరూ కూడా ఇది ఒక వెబ్ సిరీస్ అనుకుని పనిచేయలేదనీ, సినిమా అనుకునే చేశామనీ .. అందుకే అంత క్వాలిటీగా వచ్చిందని అంది. తన కథలు .. తన ప్రాజెక్టులు .. తన నిర్ణయాల విషయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా జోక్యం చేసుకోరని చెప్పింది. తనకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉందనీ .. అందుకు తగినట్టుగానే తను వాళ్లని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటానని అంది. "సొంత బ్యానర్లో బాబాయ్ తో సినిమా ఉంటుందా?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "బాబాయ్ తో సినిమా ఉంటుంది .. కాకపోతే అది ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేను. ఎందుకంటే అందుకు పెద్దమొత్తంలో బడ్జెట్ కావాలి. భవిష్యత్తులో చేసే భారీ ప్రాజెక్టులకంటే కూడా, నేను షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాను. త్వరలో మహేశ్ - సంగీత్ ల కాంబినేషన్లో రెండు ప్రాజెక్టులు ఉంటాయని మాత్రం చెప్పగలను. ఈ వెబ్ సిరీస్ ను ఇంతగా హిట్ చేసినవారందరికీ, ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించింది.


Tags:    

Similar News