బాహుబ‌లి-2కు వంద కోట్లు ఎవ‌రిచ్చారు?

Update: 2017-03-27 16:26 GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ నిర్మాత‌ల ద‌గ్గ‌ర వంద‌ల కోట్లు ఉన్నా స‌రే.. సినిమాల నిర్మాణానికి సొంత డ‌బ్బులు ఉప‌యోగించ‌రు. ఫైనాన్సుల ద్వారానే సినిమాలు నిర్మాణ‌మ‌వుతాయి. బాహుబ‌లిని రూ.450 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన‌ట్లు నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పాడు. అంత‌మాత్రాన మొత్తం డ‌బ్బులు వాళ్ల చేతుల నుంచి పెడుతున్న‌ట్లు కాదు. ఇదంతా ఫైనాన్స్ ద్వారా స‌మ‌కూర్చుకున్న‌దే.

ఈ రూ.450 కోట్ల లెక్క‌లో వాస్త‌వ‌మెంతో కానీ బాహుబ‌లి తొలి భాగానికి వంద కోట్ల‌కు పైనే ఖ‌ర్చ‌యిన‌ట్లు అంచ‌నా. అందులో ఒక రెగుల‌ర్ ఫైనాన్షియ‌ర్ నుంచి పాతిక కోట్ల దాకా 3 రూపాయ‌ల వ‌డ్డీకి తీసుకోగా.. మిగ‌తా మొత్తం రామోజీ రావు నుంచి 2 రూపాయ‌ల వ‌డ్డీకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఐతే తొలి భాగం పూర్త‌య్యాక చెల్లింపుల కోసం రామోజీ గ్రూప్ నుంచి కొంచెం పెద్ద స్థాయిలో ఒత్తిడి వ‌చ్చింద‌ట‌. అందుకే ఈసారి ఫైనాన్స్ కోసం వేరే మార్గాలు చూసింద‌ట బాహుబ‌లి టీం. ఇందులో భాగంగా దాదాపు వంద కోట్ల రూపాయ‌ల్ని మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ నుంచి వ‌డ్డీకి తెచ్చార‌ట‌.

మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ కేవ‌లం రూపాయ‌న్న‌ర వ‌డ్డీకి ఈ మొత్తం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నిర్మాత‌గా మారి.. నిర్మ‌లా కాన్వెంట్ సినిమాను నిర్మించిన మ్యాట్రిక్స్ ప్ర‌సాద్.. అంత‌కంటే ముందు నుంచే సినిమాల‌కు ఫైనాన్స్ ఇస్తున్నారు. ఐతే ఆయ‌న‌లా రూపాయిన్న‌ర వ‌డ్డీకి ఫైనాన్స్ ఇచ్చేవాళ్లు అరుదు. ఇది బాహుబ‌లి టీంకు మాత్ర‌మే ద‌క్కిన ప్ర‌త్యేక అవ‌కాశం. అందుకే ది కంక్లూజ‌న్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయ‌న్ని టీం స‌భ్యులు స‌ముచితంగా గౌర‌వించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News