హద్దులు దాటిన ఆవేశంతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్న మాటలు ఇప్పుడు కొత్త ఆగ్రహాన్ని.. చాలామందికి పూనకాల్ని తెప్పిస్తున్నాయి. ఇదంతా ఎందుకు? తెర వెనుక ఏం జరుగుతుంది? ఏది ఉత్తనే జరగదు. అలాంటప్పుడు తెలుగు నేల మీద కొత్తగా మొదలైన పోసాని బూతుల లెక్కేంటి? ఈ ఎపిసోడ్ ఎంతవరకు సాగుతుంది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు (ఏం జరిగినా బయటకు రారు. కాకుంటే అన్ని విషయాల్ని ఆఫ్ ద రికార్డుగా) మాత్రం జరుగుతున్న పరిణామాల వెనుక ఆసక్తికర కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.
అనూహ్యంగా.. అంచనాలకు భిన్నంగా వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహపు వ్యాఖ్యలు అటు తిరిగి.. ఇటు తిరిగి సంబంధం లేని వారంతా తెర మీదకు వస్తూ.. పవన్ నుటార్గెట్ చేయటం.. దారుణమైన రీతిలో.. ఇప్పటివరకు ఎవరూ ఎవరిని తిట్టని రీతిలో పోసాని విరుచుకుపడిన వైనం కొత్త ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే.. కొన్ని అసలు మొదలు కాకూడదు. ఒకసారి మొదలయ్యాక వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం మొదలవుతుంది. తాజాగా పోసాని అనే నటుడు ప్రెస్ మీట్ పెట్టి బూతుల్లో కొత్త మార్కును ప్రదర్శించి.. లైవ్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు.
రేపొద్దున మరొకరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తారు. ఇది అంతకంతకూ ఎక్కువ అయితే.. జరిగేదేమిటి? సౌండ్ పొల్యూషన్. దీని కారణం.. అనవసరమైన.. అనారోగ్యకర వాతావరణం ఎక్కువ అవుతుంది. ఇది లేనిపోని కోపాల్ని.. ఆగ్రహాల్ని పెంచుతుంది. అయితే.. ఇంత జరగటానికి అసలు కారణం.. వచ్చే నెల 10న జరగాల్సిన ‘మా’ ఎన్నికలా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక ప్యానల్ ను ఇబ్బంది పెట్టటానికి.. మరో ప్యానల్ కు మేలు జరిగేందుకు వీలుగా.. ఇప్పుడీ కొత్త రచ్చను అంతకంతకూ పెంచి పెద్దది చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.