రీమేకులపై వేటు.. డబ్బింగ్ - స్ట్రెయిట్ చిత్రాలకే ఓటు..!

Update: 2022-11-26 11:30 GMT
పాండమిక్ తర్వాత తెలుగు సినీ అభిమానులు ఒరిజినల్ కంటెంట్ నే చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టమైంది. ఇతర భాషల చిత్రాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా చూస్తున్నారు కానీ.. రీమేక్ చేస్తే మాత్రం అది స్టార్ హీరో సినిమా అయినా లైట్ తీసుకుంటున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'భీమ్లా నాయక్' దగ్గర నుంచి మొన్నటి 'గాడ్ ఫాదర్' వరకూ ఏ రీమేక్ సినిమా రిజల్ట్ చూసినా ఇదే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదే సమయంలో ఒరిజినల్ కంటెంట్ తో వచ్చిన స్ట్రెయిట్ సినిమాలు - డబ్బింగ్ చిత్రాలను తెలుగు ఆడియన్స్ విశేషంగా ఆదరించారు.

డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే.. కన్నడ సినిమాలు 'కేజీఎఫ్ 2' మరియు 'కాంతారా' తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'చార్లీ 777' - 'విక్రాంత్ రోణా' వంటి చిత్రాలు కూడా పర్వాలేదనిపించాయి. ఇటీవల వచ్చిన 'సర్దార్' సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.

ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'లవ్ టుడే' అనే డబ్బింగ్ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో నిన్న శుక్రవారం తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రివ్యూలు సానుకూలంగా రావడమే కాదు.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

'లవ్ టుడే' అనేది కోలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిన్న సినిమా. 'కోమలి' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అతని సరసన ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ - రాధికా శరత్ కుమార్ - యోగిబాబు - రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'లవ్ టుడే' చిత్రాన్ని దిల్ రాజు ముందుగా తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చేసారు. అయితే తమిళ వెర్షన్ థియేటర్లలో చూసిన తర్వాత.. రీమేక్ చేసి న్యాయం చేయలేమని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ఇటీవల వ్యాఖ్యానించారు.

నిన్న 'లవ్ టుడే' తెలుగులో రిలీజైన తర్వాత దిల్ రాజు సరైనదే అంటున్నారు. తమిళ వాసన ఎక్కువైనా సరే.. ప్రదీప్ - ఇవానా స్థానంలో వేరే యాక్టర్స్ ని పెట్టి రీమేక్ చేస్తే ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ డబ్బింగ్ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News