'కొండ పొలం' మీద ఫోకస్ చేయడం లేదేంటి.?

Update: 2021-10-01 01:30 GMT
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ''కొండ పొలం''. మెగా మేనల్లుడికి ఫస్ట్ సినిమా 'ఉప్పెన' ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. తక్కువ సమయంలో క్వాలిటీ అవుట్ పుట్ అందించే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్.. కేవలం 45 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. 'ఉప్పెన' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. అదే ఊపులో వీలైనంత త్వరగా వైష్ణవ్ రెండో చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో కుదరలేదు.

ఈ నేపథ్యంలో ''కొండ పొలం'' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి కానీ.. మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూశారు. ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అయ్యారు. అక్టోబర్ 8న ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మీద పెద్ద‌గా ఎవ‌రూ ఫోక‌స్ చేయ‌డం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గత నెలలో 'కొండ పొలం' టైటిల్ ను ప్రకటించి సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ తో పాటుగా ఓ పాటను కూడా వదిలారు. ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ప్రమోషనల్ కంటెంట్ పెద్ద‌గా ఆద‌ర‌ణ దక్కించుకోకపోగా.. సినిమాపై ఆశించిన స్థాయిలో బ‌జ్ క్రియేట్ చేయలేకపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే 'ఉప్పెన' త‌రువాత మెగా మేనల్లుడి నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజెనెస్ మాత్రం బాగానే అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసి సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారేమో చూడాలి.

కాగా, సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ అడ్వెంచర్ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ గొర్రెల కాపరులుగా కనిపించనున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తోన్న 8వ చిత్రం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేశారు.


Tags:    

Similar News