మూవీ రివ్యూ : నూటొక్క జిల్లాల అందగాడు

Update: 2021-09-03 09:33 GMT
మూవీ : ‘నూటొక్క జిల్లాల అందగాడు’

నటీనటులు: అవసరాల శ్రీనివాస్-రుహాని శర్మ-రోహిణి-శివన్నారాయణ-రమణ భార్గవ-కృష్ణభగవాన్-జబర్దస్త్ రాఘవ తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఛాయాగ్రహణం: రామ్
రచన: అవసరాల శ్రీనివాస్
నిర్మాతలు: శిరీష్-రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబా
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్

నటుడిగా విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పటికే లీడ్ రోల్ లో ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా చేశాడు. ఆ అడల్ట్ కామెడీ మూవీ అంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఈసారి క్లీన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అవసరాల. అతను ప్రధాన పాత్రలో బట్టతల నేపథ్యంలో సాగే ‘101 జిల్లాల అందగాడు’ చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే విడుదలైన ఈ సినిమా పూర్తి విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గుత్తి సూర్య నారాయణ అలియాస్ జీఎస్ఎన్ (అవసరాల శ్రీనివాస్) ఒక ఇన్ ఫ్రా కంపెనీలో ఉద్యోగి. ఉన్నంతలో అతడి జీవితం బాగానే సాగిపోతున్నప్పటికీ.. యుక్త వయసులోనే నెత్తిన జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేయడంతో తన గురించి చూసేవాళ్లు ఏమనుకుంటారో అన్న ఆత్మన్యూనతా భావం అతణ్ని వెంటాడుతుంటుంది. దీంతో విగ్గు పెట్టి మేనేజ్ చేస్తుంటాడు. తాను పని చేసే కంపెనీలోనే కొత్తగా చేరిన అంజలి (రుహాని శర్మ)తో జీఎస్ఎన్ కు స్నేహం కుదిరి.. నెమ్మదిగా అది ప్రేమగా మారుతుంది. ఐతే వీరి ప్రేమ ముదిరి పాకాన పడుతున్న సమయంలో జీఎస్ఎన్ కు బట్టతల అని అంజలికి తెలుస్తుంది. దీంతో ఆమె ఎలా స్పందించింది.. అతడి రహస్యం బయటపడ్డాక కూడా తనను ప్రేమించిందా.. ఈ క్రమంలో జీఎస్ఎన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మూడు పదుల వయసన్నా రాకముందే పూర్తిగా జుట్టంతా ఊడిపోయి విగ్గుతో మేనేజ్ చేస్తున్న హీరోను హీరోయిన్ ప్రేమిస్తుంది. ఆమెకు నిజం చెప్పేద్దామని అనుకున్నా.. అసలు విషయం తెలిస్తే తనకు ఆమె దూరమైపోతుందన్న భయంతో ధైర్యం చేయలేకపోతుంటాడతను. ఒక రోజు హీరో ఇంటికి హీరోయిన్ వస్తుంది. ఎవరో డోర్ బెల్ కొట్టారన్న కంగారులో నెత్తిన విగ్గులేదన్న విషయం మరిచిపోయి తలుపు తీసేస్తాడు హీరో. నెత్తిన జుట్టు లేని హీరోను చూడగానే ‘‘అంకుల్ జీఎస్ఎన్ ఉన్నాడా...’’ అంటుంది హీరోయిన్. ఒక్క క్షణం కంగారు పడి.. ‘‘లోపలున్నాడు పిలుస్తా కూర్చోమ్మా’’ అంటాడు హీరో. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలో భలే ఫన్నీగా అనిపించే సన్నివేశం ఇది. థియేటర్లో ఈ సీన్ దగ్గర ఒక్కసారిగా ప్రేక్షకులంతా గొల్లుమని నవ్విన శబ్దం వినిపిస్తుంది. ఐతే ఇలాంటి నవ్వులు మరిన్ని ఉండుంటే ఈ సినిమా స్థాయి వేరుగా ఉండేది. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన ఈ సినిమా ప్రోమోలు చూసి సినిమాలో కామెడీ ఓ రేంజిలో పేలి ఉంటుందని ఆశిస్తే.. ఆ ప్రోమోల్లో చూసిన దృశ్యాల్ని మించి పెద్దగా కామెడీ పండకపోవడం.. ఒక దశ దాటాక కథ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకోవడంతో రెండు గంటల నిడివి కూడా భారంగా తయారైంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు.. ఒకట్రెండు ఎమోషన్ సన్నివేశాలను మినహాయిస్తే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.

చూడ్డానికి కామెడీగా అనిపించే చాలా విషయాలు.. అనుభవించే వాళ్లకు తీవ్ర ఆవేదన కలిగించొచ్చు. బట్టతల కూడా అలాంటి విషయమే. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా ఈ పాయింట్ మీదే నడుస్తుంది. యుక్త వయసులోనే నెత్తిన జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేసిన ఓ కుర్రాడి కష్టాలను ఒక దశ వరకు ఎదుటి వాళ్ల కోణంలో వినోదాత్మకంగా చూపించి.. ఆ తర్వాత అతడి కోణం నుంచి కథను ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశారు. ఈ పాయింట్ తెలుగులో కొత్త కానీ.. మొత్తంగా ఇది కొత్త సినిమా అయితే కాదు. ఎందుకంటే బట్టతల చుట్టూ తిరిగే కథలతో బాలీవుడ్లో ఇప్పటికే  ‘బాలా’, ‘ఉజ్దా చమన్’ లాంటి సినిమాలొచ్చాయి. వాటికి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనుకరణ లాగా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా నడుస్తుందో ఒక అంచనాకు వచ్చేసే ఇలాంటి సినిమాలతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంత తేలిక కాదు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకున్నపుడు రెండు మూడు ఫన్నీ సీన్స్ రాయడం.. తీయడం పెద్ద కష్టం కాదు. ముఖ్యంగా టీజర్లు.. ట్రైలర్లు కట్ చేసుకోవడానికి ఇలాంటి పాయింట్లు చాలా బాగుంటాయి. కానీ రెండు గంటల నిడివిలో కథను ఎంగేజింగ్ గా చెప్పడం.. సీన్లు రిపీట్ కాకుండా చూసుకోవడం.. కామెడీతో పాటు ఎమోషన్ కూడా సమపాళ్లలో జొప్పించడం.. ఆషామాషీ విషయం కాదు. ‘నూటొక్క జిల్లాల అందగాడు’కు అవే సమస్యగా మారాయి.

సినిమా ఆరంభంలో కొన్ని సీన్లు ఫన్నీగా అనిపించినా.. ఒక దశ దాటాక బట్టతల చుట్టూ సీన్లు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్లు మరీ సాదాసీగా నడిపించేశారు. ఒకే పాయింట్ మీద కథ నడుస్తుండటంతో ఒక దశ దాటాక విసుగొస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చెల్లి పెళ్లి జరుగుతుంటే హీరో బట్టతలను దాచుకోవడానికి పాట్లు పడే ఎపిసోడ్ మరీ సాగతీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గరే హీరో బండారం బయటపడిపోవడంతో.. ఇక అక్కడి నుంచి హీరోయిన్ మనసు మారడం.. హీరోలో పరివర్తన రావడం నేపథ్యంగా సాగే సన్నివేశాలు భారంగా గడుస్తాయి. కథ ముందుకే కదలకుండా స్ట్రక్ అయిపోతుంది. ద్వితీయార్దంలో కామెడీకి పెద్దగా స్కోపే లేకపోవడం వల్ల కూడా సినిమా మరింత నెమ్మదించింది. హీరోయిన్ దగ్గర తన బాధను చెప్పుకునే సీన్.. చివర్లో హీరో తన రహస్యాన్ని బహిరంగ పరిచి.. తానొక అందగాడిని అని నమ్మి ఆ విషయాన్ని అందరికీ చెప్పే స్పీచ్ ద్వారా చెప్పడం పర్వాలేదనిపిస్తాయి. అవి మినహాయిస్తే ద్వితీయార్ధాన్ని భరించడం కష్టమే. ప్రొడక్షన్ పరంగా కూడా చాలా లిమిటేషన్లు ఉండటం కూడా సినిమాకు చేటు చేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఓకే అనిపించినా.. కొన్ని సీన్ల వరకు బాగున్నా.. ఓవరాల్ గా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ నిరాశకు గురి చేస్తుంది.  కొంచెం హంగామా కోరుకునే మాస్ ప్రేక్షకులకైతే ఇది ఎంతమాత్రం రుచించకపోవచ్చు.

నటీనటులు: అవసరాల శ్రీనివాస్ తన వరకు బాగా నటించాడు. చాలా వరకు సరదాగా సాగే పాత్రలే చేసిన అవసరాల.. ఈ చిత్రంలో రెండు పార్శ్వాలున్న క్యారెక్టర్ని బాగానే పండించాడు. ద్వితీయార్ధంలో కొన్ని ఎమోషనల్ సీన్లలో అతడి నటన ఆకట్టుకుంటుంది. రుహాని శర్మ ‘చి ల సౌ’ తర్వాత ఆకట్టుకున్న సినిమా ఇదే. అంజలి పాత్రకు ఆమె సరిపోయింది. హీరో తల్లిగా రోహిణి ఎప్పుడూ కనిపించే తరహాలోనే ఇందులోనూ దర్శనమిచ్చింది. ‘తరగతి గది దాటి’లో ఆశ్చర్యపరిచిన రమణ భార్గవ.. ఇందులో సత్తిపండుగా ఓకే అనిపించాడు. తక్కువ నిడివిలోనే అతను ప్రతిభ చాటుకున్నాడు. హీరో ఫ్రెండు పాత్రలో చేసిన నటుడూ బాగా చేశాడు. శివన్నారాయణ.. జబర్దస్త్ రాఘవ.. వీళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం: ‘ఫిదా’ తర్వాత పెద్దగా కనిపించని శక్తికాంత్ కార్తీక్.. ఈ సినిమాలో అంచనాలను అందుకోలేకపోయాడు. పాటలేవీ మళ్లీ వినాలనిపించేలా లేవు. సోసోగా సాగిపోయాయి. శక్తికాంత్ నేపథ్య సంగీతం పర్వాలేదు. రామ్ కెమెరా పనితనం జస్ట్ ఓకే అనిపిస్తుంది. క్రిష్.. దిల్ రాజు లాంటి వాళ్లు నిర్మించిన సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత సాధారణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవసరాల శ్రీనివాస్ రచయితగా తన స్థాయికి తగ్గ ఔట్ పుట్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల డైలాగుల్లో అవసరాల మార్కు చమత్కారం బాగానే ధ్వనించింది. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డోస్ మరీ ఎక్కువైంది. దర్శకుడు రాచకొండ విద్యసాగర్ ఉన్న పరిమితుల్లో పనితనం చూపించే ప్రయత్నం చేశాడు కానీ.. అతడి నరేషన్ మరీ స్లో అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా లేకపోయింది. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: నూటొక్క జిల్లాల అందగాడు.. నవ్వుల డోస్ సరిపోలేదు

రేటింగ్-2.25/5
Tags:    

Similar News