హీరోల కోసం కథలు రాసే అలవాటు లేదు: శేఖర్ కమ్ముల

Update: 2021-04-13 16:30 GMT
యూత్ కి నచ్చే దర్శకుల జాబితాలో శేఖర్ కమ్ముల పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు ఇష్టపడే ప్రేమకథలను అందించడంలో ఆయన పండితుడు. ప్రేమికులకు రెక్కలు తగిలించి తన కథల ప్రపంచంలో విహరింపజేయడం ఆయనకి బాగా తెలుసు. కథ ఏదైనా .. కథనం ఎలాంటిదైనా సహజత్వం ఆయన సినిమాలకి ప్రధానమైన బలం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి విపరీతమైన మార్కెట్ ఉంది. అలాంటి ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పంచుకున్నాడు.

"నేను పుట్టింది ఏలూరులో .. పెరిగిందంతా హైదరాబాద్ లోనే. ఇంజనీరింగ్ చదివాను .. యావరెజ్ స్టూడెంట్ నే. అమెరికాలో మా అన్నయ్య ఉంటారు .. అక్కడ ఉంటూ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ పొందాను. ఆ తరువాత దర్శకుడిగా మారాను. 'ఆనంద్' సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో, దానిని రిలీజ్ చేయడానికి అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాను. 'ఆనంద్' హిట్ అయిన తరువాత, ఎవరూ కూడా నన్ను పిలిచి తమతో సినిమా చేయమని ఆఫర్ ఇవ్వలేదు.

ఇన్ని సినిమాలు చేసినా ఇంకా నేను ఏవారికైనా స్టోరీ చెప్పాలంటే భయం వేస్తూ ఉంటుంది. అందువలన నేను తీయగలనో లేదో అనే డౌట్ అవతల వాళ్లకి కలిగుంటుందేమో. నేను ఎప్పుడూ కూడా హీరోల కోసం కథలు రాయను. కథ రాసిన తరువాత దానికి తగిన హీరోలను వెతికిపట్టుకుంటాను. హీరోలు తమకి నచ్చలేదని చెప్పినా నేను పెద్దగా ఫీలవ్వను. 'ఆనంద్' .. 'గోదావరి' .. 'హ్యాపీడేస్' సినిమాలు చూస్తే, వాస్తవానికి దగ్గరగా కొత్తగా చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. నా సినిమాలు నాకు ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.      
Tags:    

Similar News