'బింబిసార'గా కల్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరు: ఎన్టీఆర్

Update: 2022-07-30 03:40 GMT
ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ మధ్యగల సాన్నిహిత్యం గురించి తెలిసిందే. తాను 'బింబిసార' వంటి పెద్ద ప్రాజెక్టును చేయడానికి తగిన ధైర్యాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని కల్యాణ్ రామ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చెబుతూ వచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి తన లుక్ చూసి ప్రొసీడ్ అని ఎన్టీఆర్ చెప్పిన తరువాతనే తనపై తనకి నమ్మకం కుదిరిందని అన్నాడు. ఆగస్టు 5వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరువుకుంది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వచ్చాడు.  

 ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఒక రోజున కల్యాణ్ అన్నయ్య కాల్ చేసి, ఒక మంచి కథను నేను విన్నాను .. నువ్వు కూడా వింటే బాగుంటుంది అన్నాడు. దర్శకుడు కొత్తగా వచ్చాడు .. పెద్దగా  అనుభవం లేదు .. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుందా లేదా అని భయపడ్డాము. నేను మీ అందరికంటే అదృష్టవంతుడిని  .. ఎందుకంటే ఈ సినిమాను ముందుగానే చూడటం జరిగింది. ఎంత కసితో అయితే తాను ఆ రోజున 'బింబిసార' కథను చెప్పాడో,  అంతకంటే గొప్పగా ఈ సినిమాను మలిచాడు.

కథాకథనం ముందుగా తెలిసిన నేనే ఈ సినిమా చూస్తూ ఎక్సయిట్ మెంట్ కి గురయ్యాను. ఇక ఈ సినిమా చూస్తూ మీరంతా కూడా అదే అదే ఉత్కంఠను పొందుతారు. రేపటి రోజున వశిష్ఠ తీయబోయే అద్భుతమైన సినిమాలకి 'బింబిసార' ఒక ట్రైలర్ లాంటిది. ఈ సినిమా చూస్తుంటే నాకు ఇక కొత్త చోటాకె నాయుడు కనిపించాడు. మిగతా సాంకేతిక నిపుణులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్లందరూ ఎంతో అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.

'బింబిసార'లో అన్నిబాగానే ఉన్నాయి .. కానీ ఏదో తెలియని వెలితి కనిపిస్తూ ఉండేది. ఆ వెలితి గురించే నేను .. కల్యాణ్  రామ్ మాట్లాడుకునేవాళ్లం. ఆ వెలితి కీరవాణిగారి ఎంట్రీతో పోయింది. 'బింబిసార' విషయంలో ఈ సినిమా టీమ్ కి భయం లేకపోవడానికి కారణం కీరవాణిగారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ కీరవాణిగారు అని ఈ సినిమా చూసిన తరువాత మీరు కూడా అంటారు. గతంలో మీకు చెప్పాను .. ఇప్పుడు చెబుతున్నాను. మీకు నచ్చేవరకూ .. మీరు కాలర్ ఎగరేసుకునే వరకూ సినిమాలు చేస్తూనే ఉంటాము.  

'బింబిసార' తరువాత కల్యాణ్ రామ్ తన కాలర్ ను ఎంత పైకి ఎత్తుతారో మీరే చూస్తారు. 'బింబిసార'కి ముందు కల్యాణ్  రామ్ .. 'బింబిసార'కి తరువాత కల్యాణ్ రామ్ అని అంతా చెప్పుకుంటారు. ఒక సినిమా కోసం తాను ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. 'బింబిసార' కోసం ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. ఒక నటుడిగా తనని తాను మలచుకున్నాడు. కల్యాణ్ రామ్ తప్ప ఈ పాత్రకి న్యాయం చేయగలిగే నటుడు మరొకరు లేరు ..  ఉండడు కూడా.

ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు .. థియేటర్స్ కి జనాలు రావడం లేదని అంటున్నారు. కానీ నేను నమ్మను .. అద్భుతమైన సినిమాలను మీరు ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాతో పాటు వస్తున్న 'సీతా రామం'ను కూడా ఆదరించండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరిపోయండి" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News