70 రోజుల్లోనే రెండిటినీ చుట్టేశారు!

Update: 2018-12-29 11:30 GMT
`ఎన్టీఆర్ బ‌యోపిక్‌` కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు క్రిష్ కి మాత్ర‌మే అవ‌కాశం ఎందుకు ద‌క్కింది?  వేరొక ద‌ర్శ‌కుడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వ‌లేదు? ఇదో సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌కు ముందు ఒకానొక ఇంట‌ర్వ్యూలో బాల‌య్య‌ బాబు అన్న మాట‌ల్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి. హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ఎక్స్‌క్లూజివ్ గా పాత్రికేయుల‌తో మాట్లాడిన బాల‌కృష్ణ  కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు.

నా చుట్టూ కొంత‌మంది తిరుగుతుంటారు. అందులో భ‌జ‌న బృందం ఉంటుంది. అలా ఎంద‌రో నాకు ఇది చెయ్.. అది చెయ్ అని చెబుతుంటారు. దాంతో ఏది చేయాలో అర్థం కాక ఎంద‌రికో అవ‌కాశాలిచ్చాను. అలా ఇచ్చిన‌ప్పుడ‌ల్లా ఏదేదో తీశారు.. అని బాల‌య్య అన్నారు. త‌న కెరీర్ లో చెత్త సినిమాలు తీసిన ద‌ర్శ‌కులంద‌రినీ ఆ స‌మావేశంలో  గుర్తు చేసుకుని త‌బ‌లా వాయించారు బాల‌కృష్ణ‌. బోలా శంక‌రుడిలా ఎవ‌రో ఒక‌రిని న‌మ్మి అవ‌కాశం ఇస్తే త‌న పుట్టి ముంచిన సంద‌ర్భాలే ఎక్కువగా ఉన్నాయ‌ని ఆరోజు బాల‌య్య మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మైంది. అదొక్క‌టే కాదు.. అస‌లు తాను ఇన్నాళ్లు అలా బోలాగా ఎవ‌రినో ఒక‌రిని న‌మ్మేసి అవ‌కాశం ఇచ్చేశాన‌ని, ఇక‌ పై అలాంటి అవ‌కాశం లేద‌ని బాల‌య్య‌బాబు ఆ సంద‌ర్భంగా అన‌డం ప్రెజెంట్‌ లో మ‌రోసారి చ‌ర్చ‌కొచ్చింది.

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రాన్ని క్రిష్ క‌థ ఎంత బాగా చెప్పాడో అంత‌కుమించి ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించార‌ని, చాలా త‌క్కువ స‌మ‌యంలో సినిమా తీసి స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడ‌ని క్రిష్ ని బాల‌య్య‌బాబు పొగిడేశారు. స‌రిగ్గా అదే కార‌ణంతో తేజ ఈ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా కంగ‌న సినిమాతో బిజీగా ఉన్న క్రిష్ ని ఈ ప్రాజెక్టు కోసం ఆహ్వానించారు. త‌న జీవితంలో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రంగా భావించిన `ఎన్టీఆర్ బ‌యోపిక్‌` ని క్రిష్ మాత్ర‌మే తీయాల‌ని ఆయ‌న భావించార‌ట‌. తేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత‌.. క్రిష్ ని ప్రాజెక్టుకు ఆహ్వానించ‌డానికి కార‌ణ‌మ‌దే. బాల‌య్య పిలుపుతో  కంగ‌న `మ‌ణిక‌ర్ణిక‌`ను సైతం కాద‌నుకుని క్రిష్ ఈ బ‌యోపిక్ కోసం మ‌ధ్యంత‌రంగా వ‌చ్చేశారు. బాల‌య్య పిలుపు వ‌చ్చింది కాబ‌ట్టి ఆ గౌర‌వాన్ని నిల‌బెట్టాల‌ని క్రిష్ భావించి వ‌చ్చేశార‌ట‌.

ఇక‌పోతే `ఎన్టీఆర్ బ‌యోపిక్‌` రెండు భాగాల్ని కేవ‌లం 70 రోజుల్లోనే క్రిష్ పూర్తి చేశార‌ని రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ నేటి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అలాగే అత్యంత భారీ చిత్రంగా రూపొందించిన `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి` చిత్రాన్ని కేవ‌లం 75 రోజుల్లో పూర్తి చేసిన స‌మ‌ర్ధుడు క్రిష్. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సుమారు 80కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు అదే 70 రోజుల్లో తెర‌కెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ (క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు) ఏకంగా 80కోట్లు పైగా బిజినెస్ చేస్తున్నాయి. ఇవి పెద్ద స‌క్సెసై రూ.200కోట్ల వర‌కూ వ‌సూలు చేస్తాయ‌ని.. మినిమం 100కోట్ల షేర్ వ‌సూళ్లు తెస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. ఇంత పెద్ద బిజినెస్ సాగ‌డానికి .. ఎన్టీఆర్ టీమ్ అంత కాన్ఫిడెంట్‌ గా ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. ఈ మొత్తం ప్రాసెస్‌ లో క్రిష్ పాత్ర విస్మ‌రించ‌లేనిద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మేకింగ్ కూడా ఓ చ‌రిత్ర అవుతుంద‌ని సాయిమాధ‌వ్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News