గ్యారేజ్.. ఒక కొత్త చరిత్రకు నాంది

Update: 2016-08-14 12:01 GMT
రెండు మూడేళ్ల కిందటి వరకు మన తెలుగు స్టార్ హీరోలు రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేసేవాళ్లు. కొత్తదనం అంటే కంగారు పడేవాళ్లు. వాళ్ల సినిమాలు ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయేవి. దర్శకులకు ఏదైనా కొత్త ఆలోచనలు వచ్చినా.. అయ్యో ఇలా అయితే మన ప్రేక్షకులు చూడరండి అంటూ చుట్టూ ఉన్న జనాలు వాయించేసేవాళ్లు. హీరోలు కూడా అలాంటి కథల్ని ఎంకరేజ్ చేసేవాళ్లు కాదు. కానీ ట్రెండ్ అన్నది ఎప్పుడూ ఒకలా ఉండదు. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ ఉంటుంది.

గత ఏడాది రెండేళ్లలో మన సినిమాల్లో చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పట్లా ఫార్ములా సినిమాల్ని ఆదరించట్లేదు. స్టార్ల సినిమాల్లో అయినా కొత్తదనం ఉండాల్సిందే అని తమ తీర్పుల ద్వారా తేల్చిచెబుతున్నారు. నాగార్జున లాంటి స్టార్ హీరో చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్ర పోషిస్తే గొప్పగా ఆదరించారు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ లాంటి థ్రిల్లర్ చేస్తే ఆదరించారు. శ్రీమంతుడులో మహేష్ ఉదాత్తమైన పాత్ర పోషిస్తే బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో స్టార్ల నుంచి వచ్చిన రొటీన్ సినిమాల్ని తిప్పికొట్టారు. కమర్షియల్ సినిమాల్లో సైతం ఇప్పుడు కథాకథనాలకే ప్రాధాన్యం ఉంటోంది. కొత్త క్యారెక్టర్లు.. లోతున్న కథలకు ఇప్పుడు అందరూ ప్రాధాన్యమిస్తున్నారు.

ఇప్పటికే కమర్షియల్ సినిమాల్లో చాలా మార్పు కనిపిస్తుండగా.. ‘జనతా గ్యారేజ్’తో మరింత గొప్ప మార్పు చూడబోతున్నామేమో అన్న ఆశ కలుగుతోంది. హీరోను ప్రకృతి ప్రేమికుడిగా చూపించడం.. ఆ కాన్సెప్ట్ మీద ఒక పాటే పెట్టడం.. ఇంకా ట్రైలర్లో కనిపిస్తున్న అంశాలన్నీ కూడా ఇప్పటిదాకా మన సినిమాల్లో చూడనివి. మోహన్ లాల్ పాత్ర కూడా చాలా బలంగా ఉండేలా కనిపిస్తోంది. ‘శ్రీమంతుడు’తో కమర్షియల్ సినిమాకు కొత్త అర్థం చెప్పిన కొరటాల.. ఈసారి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ‘జనతా గ్యారేజ్’ ట్రైలర్ చూస్తే. రెండేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే ఓ స్టార్ హీరో సినిమా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించేవారు కాదు. సినిమా అంచనాల్ని అందుకుని.. పెద్ద హిట్టయితే తెలుగులో ఇకపై తెలుగులో కమర్షియల్ సినిమాల అర్థమే మారిపోతుందనడంలో సందేహమే లేదు.
Tags:    

Similar News