పెళ్ళిసందడి లేడీ డైరెక్టర్ కి ఆఫర్లు...?

Update: 2021-10-28 00:30 GMT
పాతికేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఒక సాధారణ చిత్రం పెళ్ళి సందడి సూపర్ హిట్ కొట్టింది. అందులో స్టార్లు లేరు, కానీ స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఉన్నారు, మేకర్స్ గా వెనక బలంగా ప్రముఖ నిర్మాతలు   అల్లు అరవింద్, అశ్వనీదత్ ఉన్నారు. అతి తక్కువ బడ్జెట్ తో సినిమా తీస్తే మోయలేనంతగా లాభాల మూటలు వచ్చి పడ్డాయి. నాడు చిన్న హీరోగా ఉన్న శ్రీకాంత్ కి స్టార్ డమ్ ని తెచ్చిన సినిమా ఇది. ఇపుడు ఆయన వారసుడు రోషన్ ని హీరోగా పెట్టి అచ్చొచ్చిన పెళ్ళి సందడి టైటిల్ తోనే ప్రయోగం చేశారు. ఇది సీక్వెల్ కాని సీక్వెల్. రోటీని లవ్ స్టోరీ. పాటలు బాగున్నాయి. హీరో రోషన్, హీరోయిన్ శ్రీ లీల సూపర్ అని రివ్యూస్ వచ్చాయి. అయితే సినిమాలో విషయం లేదని సమీక్షలు పెదవి విరిచినా దసరా సందడిలో పడి ఈ పెళ్ళి సందడి కూడా లాభాలను గడించింది. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీకి ఏకంగా 11 కోట్ల దాకా వసూళ్ళు వచ్చాయి. అంటే పెట్టిన రూపాయికి రూపాయి లాభం అన్న మాట..

మొత్తానికి రాఘవేంద్రుడి మాయాజలం అనుకున్నా మరేమనుకున్నా కూడా ఈ పెళ్ళి సందడి కూడా గట్టెక్కినట్లే. ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేశారు. దర్శకత్వం వహించింది గౌరీ రోణంకి. ఆమె  విశాఖ వాసి. విశాఖలోని ఏయూలో ఆమె థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఆ మీదట సినీ రంగాన ప్రవేశించి రాఘవేంద్రరావు వద్దనే పదేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ గా దర్శకత్వ శాఖలో పనిచేశారు. మొత్తానికి ఆమెనే దర్శకురాలిగా పెట్టి దర్శకేంద్రుడు ఈ మూవీ తీశారు. ఈ మూవీ కూడా సక్సెస్ అయినట్లే.

మరి గౌరీ రోణంకికి డైరెక్టర్ గా ఆఫర్లు వస్తాయా అన్నదే చూడాలి.  నిజానికి పెళ్ళి సందడి హడావుడి అంతా రాఘవేంద్రుడిదే అయింది. ఆయనే తెర ముందూ కనిపించారు. ఆయన ప్రమోషన్లలో కూడా మెరిసారు. డైరెక్టర్ ఆయనే అని కూడా రివ్యూస్ రాసిన వారూ అనుకున్నారు. అయితే ఈ మూవీ వెనక గౌరి కష్టం చాలానే ఉంది అంటున్నారు. ఆమె కూడా టాలీవుడ్ లో మంచి సినిమాలు తీస్తాను అని చెబుతున్నారు. తాను పుట్టిన గడ్డ విశాఖలో జరిగిన సన్మాన సభలో మాట్లాడుతూ మంచి మహిళా దర్శకురాలిగా తనను తాను రుజువు చేసుకుంటానని అంటున్నారు. టాలీవుడ్ ఆమెకు చాన్స్ ఇస్తే మాత్రం లేడీ డైరెక్టర్ గా నిలదొక్కున్నట్లే. గురువు రాఘవేంద్రుడు ఈ విషయంలో హెల్ప్ చేస్తే కనుక గౌరీ రోణంకి కూడా  ఒక కలిదిండి జయలా, విజయనిర్మల, భానుమతి, సావిత్రి మాదిరిగా మహిళా దర్శకురాలిగా పేరు స్థిరం చేసుకుంటాను అంటున్నారు.
Tags:    

Similar News