మూవీ రివ్యూ: ‘ఆఫీసర్’

Update: 2018-06-01 16:43 GMT
‘ఆఫీసర్’ మూవీ రివ్యూ
నటీనటులు: అక్కినేని నాగార్జున - బేబీ కావ్య - మైరా సరీన్ - షాయాజి షిండే - ఫిరోజ్ అబ్బాసి తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: భరత్ వ్యాస్ - రాహుల్ పెనుమత్స
నిర్మాణం: కంపెనీ ప్రొడక్షన్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

‘శివ’ లాంటి సెన్సేషనల్ మూవీని అందించిన కాంబినేషన్ అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మలది. ఆ తర్వాత వీళ్ల కలయికలో ఇంకో రెండు సినిమాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేసిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

శివాజీ రావు (అక్కినేని నాగార్జున) సమర్థుడైన.. నిజాయితీ ఉన్న పోలీసాఫీసర్. అతను ఒక క్లిష్టమైన కేసును డీల్ చేయడం కోసం ముంబయి వెళ్తాడు. ముంబయిలో మాఫియాను ఏరిపారేయడంలో కీలక పాత్ర పోషించి.. ఆ తర్వాత ఫేక్ ఎన్ కౌంటర్లతో తనే వ్యవస్థకు సవాలుగా మారిన నారాయణ్ పసారి అనే ఆఫీసర్ పై విచారణ కోసం కోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందానికి శివాజీ నాయకత్వం వహిస్తాడు. పసారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి.. అతడిని అరెస్టు కూడా చేయిస్తాడు. కానీ అతను ఆ కేసు నుంచి తేలిగ్గా బయటపడిపోతాడు. తర్వాత మరింత ప్రమాదకరంగా మారతాడు. శివాజీని కూడా లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ స్థితిలో శివాజీ.. పసారి ఆట కట్టించడానికి ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఆఫీసర్’ సినిమా క్లైమాక్స్ ఒక పెద్ద బిల్డింగ్ మేడ మీద నడుస్తుంది. అక్కడ హీరో నాగార్జున ఉంటాడు. ఎదురుగా విలన్ ఉంటాడు. నాగ్ తనదైన శైలిలో విలన్ కు పంచ్ లు ఇస్తుంటే.. బ్యాగ్రౌండ్లో డిష్యుం డిష్యుం అన్న సౌండ్లు వినిపిస్తుంటాయి. ఆ సెటప్ అంతా చూశాక తెలుగు సినిమా గతిని మార్చిన నాగార్జున-వర్మల ‘శివ’లో నాగ్-రఘువరన్ మధ్య క్లైమాక్స్ ఫైట్ గుర్తుకు రాకమానదు. అదే సమయంలో అప్పటి వర్మకు.. ఇప్పటి వర్మకు తేడా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘శివ’లో పతాక సన్నివేశానికి వచ్చేసరికి అప్పటిదాకా ఆ సినిమా ఇచ్చిన అద్భుత అనుభూతులతో మైమరిచిపోతుంటే.. ‘ఆఫీసర్’లో అప్పటిదాకా జరిగిన తంతునంతా ఎంత త్వరగా మరిచిపోదామా అన్న భావన కలుగుతుంటుంది.

గత పదేళ్ల వర్మ ట్రాక్ రికార్డు చూసి కూడా నాగార్జున అతడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనే అనుకున్నారందరూ. కానీ ‘ఆఫీసర్’ ప్రోమోలు చూస్తే ఎన్నెన్నో సందేహాలు కలిగాయి. అయినప్పటికీ వర్మ చాలా శ్రద్ధతో సినిమా తీశాడని విడుదల ముంగిట నాగ్ నొక్కి వక్కాణించడంతో నమ్మకంగా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. ఆరంభం నుంచి చివరిదాకా ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది అని ఎదురు చూడటానికే సరిపోతుంది. ఒక పాయింట్ గా చెప్పుకోవడానికి ‘ఆఫీసర్’ కథ బాగానే అనిపించొచ్చు. మాఫియాను ఏరేయడానికి కారణమైన పోలీసాఫీసర్.. తనే ఒక చీడపురుగులా తయారై వ్యవస్థను కబళించేస్తుంటే.. మరో ఆఫీసర్ వచ్చి అతడి ఆట కట్టించడం అనే పాయింట్ వినడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో వర్మ విఫలమయ్యాడు. అతడి సినిమాల్లో ఒకప్పుడు కనిపించిన డెప్త్ ఇందులో లేకపోయింది. వర్మ తీసిన ‘సత్య’.. ‘కంపెనీ’ తరహా మాఫియా కథల్లో కనిపించిన డ్రామా.. ఇంటెన్సిటీ ఇందులో పూర్తిగా లోపించింది. సాంకేతిక అంశాల్లో మినహాయిస్తే ఇంకెక్కడా ఒకప్పటి వర్మ ముద్ర కనిపించలేదు.

కథకు కీలకమైన విలన్ పాత్రను చాలా పేలవంగా తీర్చిదిద్డడం.. అందులో కనిపించిన నటుడిలోనూ ఇంటెన్సిటీ లోపించడంతోనే ‘ఆఫీసర్’ బలహీనంగా తయారైంది. కథను నడిపించాల్సిన విలన్ పాత్రే తేలిపోవడంతో.. ఇక హీరో పాత్ర ఎలా ఎలివేట్ అవుతుంది? ఆఫీసర్ నెవర్ దిస్ స్కేరీ అంటూ ఈ చిత్రానికి క్యాప్షన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఈ క్యాప్షన్ చూసి ఒక రూత్ లెస్.. పవర్ ఫుల్ పోలీసుని చూడబోతున్నామని అనుకుంటాం. కానీ సినిమాలో హీరో చేసేదేమీ ఉండదు. ఒక పేరు మోసిన ఆఫీసర్ని విచారించడానికి హైదరాబాద్ నుంచి ముంబయికి వచ్చే ఆఫీసర్ నుంచి మనం ఎంతో ఆశిస్తాం. విచారణ తీరు చాలా ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా  సాగుతుందనుకుంటాం. కానీ బలమైన సీన్ ఒక్కటీ లేకుండా.. టకటకా కొన్ని షాట్లు పైపైన చూపించేస్తారు. వెంటనే విలన్ని అరెస్టు చేసేస్తాడు హీరో. ఇక హీరో ప్రత్యేకత ఏం చూపించినట్లు? విలనేమో సింపుల్ గా తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్షిని చంపించేసి బయటికొచ్చేస్తాడు? ఎత్తులు పైఎత్తులు.. మలుపులకు ఆస్కారమే లేదిక్కడ.

ఇటు హీరో పాత్రకు.. అటు విలన్ పాత్రకు ఆరంభంలో విపరీతమైన బిల్డప్ ఇస్తారు. అది చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. నెమ్మదిగా ఆ పాత్రల్ని తేల్చేస్తారు. ఊరికే కెమెరా విన్యాసాలు.. నేపథ్య సంగీతం ద్వారా ఏదో జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడమే తప్ప సన్నివేశాల్లో బలం లేకపోయింది. కాకపోతే ఉన్నంతలో ప్రథమార్ధంలోనే కొన్ని సీన్లు ఆసక్తి రేకెత్తిస్తాయి. హీరో-విలన్ ముఖాముఖి సన్నివేశాల్ని బాగా తీశాడు వర్మ. కానీ కథలో ఏ మలుపులూ లేకపోవడంతో క్రమంగా ఆసక్తి సన్నగిల్లిపోతూ వస్తుంది. ద్వితీయార్ధంలో అసలు కథంటూ ఏమీ లేకపోయింది. కాల్పులు.. ఛేజింగులు.. ఫైటింగులతోనే నడిచిపోతుంది సినిమా.

తాను ఎదుర్కోవాల్సిన విలన్ నేతృత్వంలోనే హీరో పని చేయాల్సి రావడం అన్నది కాన్ఫ్లిక్ట్ కు మంచి స్కోప్ ఇచ్చినా.. సరైన సీన్లు పడకపోవడంతో ‘ఆఫీసర్’ పూర్తిగా గాడి తప్పుతుంది. తండ్రి-కూతురి సెంటిమెంట్ కూడా ఏమంత వర్కవుట్ కాలేదు. ఆ సీన్లు నాటకీయంగా ఉంటాయి. ఒక చిన్నమ్మాయి అంత మెచ్యూరిటీతో మాట్లాడుతుంటే అతిగా అనిపిస్తుంది. వర్మ సినిమాలో ఇలాంటి సీన్లు ఊహించం అసలు. రౌడీల ఎటాక్ నుంచి తప్పించుకుని నాగ్ తన కూతురితో పారిపోయే ఒక సీన్.. అందులో నాగ్ హావభావాలు చూస్తే ఆయనసలు ఈ సీన్ ఎలా ఓకే చేశారో అనిపిస్తుంది. గత దశాబ్ద కాలంలో వర్మ నుంచి పేలవమైన సినిమాలు చూసి చూసి అలసిపోయిన అభిమానులకు.. వాటితో పోలిస్తే ‘ఆఫీసర్’ చాలా బెటర్ గా అనిపించొచ్చేమో కానీ.. నాగార్జున-వర్మ కాంబినేషన్లో ఆశించే సినిమా అయితే కాదిది.

నటీనటులు:

అక్కినేని నాగార్జున శివాజీ రావు పాత్రలో బాగానే చేశాడు. ఈ పాత్రకు తగ్గ ఫిట్నెస్ చూపించడంలో నాగ్ శ్రద్ధ కనిపిస్తుంది. వర్మ స్టయిల్లోనే ఆయన నటన సాగింది. కథకు కీలకమైన సన్నివేశాల్లో నాగ్ అందుకు తగ్గ ఇంటెన్సిటీ చూపించాడు. ఆయన మేకప్ లేకుండా ఈ పాత్రలో నటించడం వల్ల కొన్ని చోట్ల లుక్ తేడాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా నాగ్ ఓకే అనిపిస్తాడు. నారాయణ్ పసారి పాత్రలో నటించిన నటుడు పర్వాలేదు. కానీ ఆ పాత్రకు ప్రేక్షకులు కనెక్టవడం కష్టమే. పెద్ద స్థాయి నటుడు.. ప్రేక్షకులకు పరిచయమున్నవాడు చేయాల్సిన పాత్ర అది. కొత్త నటుడిని తెచ్చిపెట్టడంతోనే ఆ పాత్ర స్థాయి తగ్గిపోయింది. బేబీ కావ్య బాగానే చేసింది. హీరోయిన్ మైరా సరీన్ ఏ రకంగానూ మెప్పించలేదు. ఆమెలో అందం లేదు. నటన విషయంలోనూ చెప్పుకోడానికేమీ లేదు. ఒక పాటలో ఆమె అందాలు ఆరబోసింది. అజయ్.. షాయాజి షిండే.. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతికవర్గం:

వర్మ సినిమాలకు టెక్నీషియన్లు మారినా ఔట్ పుట్ మాత్రం ఒకేలా ఉంటుంది. ‘ఆఫీసర్’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంగీతం.. ఛాయాగ్రహణం మనకు అలవాటైన రీతిలోనే ఉంటాయి. రవిశంకర్ పాటలు.. నేపథ్య సంగీతం కొత్తగా ఏమీ అనిపించవు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల ప్రత్యేకంగా అనిపిస్తుంది. చాలా చోట్ల లౌడ్ గా ఉండి ఇబ్బంది పెడుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం గమనించవచ్చు. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పని చేసినా సినిమా అంతా ఒకే రకంగా ఉంటుందంటే ఇక్కడ వర్మ మార్కేంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కెమెరా యాంగిల్స్ వర్మ సినిమాల్లో కొత్తేమీ కాదు. ఒక దశ దాటాక అవి మొహం మొత్తేలా చేస్తాయి. కొన్ని కెమెరా యాంగిల్స్ ఇరిటేట్ చేస్తాయి కూడా. నిర్మాణ విలువలు చాలా పేలవంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్. ఈ విషయంలో చాలా రాజీ పడటం వల్ల ఒక సినిమా చూస్తున్న భావనే కలగదు. ఇక వర్మ పనితీరు గురించి ఏం చెప్పాలి? సాంకేతిక అంశాల మీద.. టేకింగ్ మీద పెడుతున్న శ్దద్ధను ఆయన రైటింగ్ దగ్గర పెట్టట్లేదనడానికి ‘ఆఫీసర్’ మరో రుజువుగా కనిపిస్తుంది. ఒక పాయింట్ మీద ఎగ్జైట్ అయి సినిమా తీసేసినట్లు అనిపిస్తుంది. ఒకసారి శివ.. సత్య.. కంపెనీ సినిమాల్ని చూసుకుని.. తర్వాత ‘ఆఫీసర్’ చూసుకుంటే తానెక్కడ తప్పు చేస్తున్నది వర్మకు అర్థమవుతుందేమో.

చివరగా: ఆఫీసర్.. అదే వర్మ.. అదే సినిమా

రేటింగ్-1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News