'2.0’లో రెండు పాటలేనా?

Update: 2017-09-04 09:46 GMT
శంకర్ సినిమా అంటే పాటలు ఎంత గ్రాండ్‌ గా ఉంటాయో.. సినిమాకు అవి ఎంత పెద్ద ఆకర్షణగా నిలుస్తాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ ఎంత విలక్షణమైన సినిమా తీసినప్పటికీ.. అందులో పాటలకు చాలా ప్రాధాన్యముంటుంది. ‘రోబో’ లాంటి ప్రయోగాత్మక చిత్రంలోనూ తనదైన శైలిలో పాటలు పెట్టి వినోదాన్ని పంచాడు. ఐతే ఈ సినిమా సీక్వెల్ ‘2.0’లో మాత్రం శంకర్ పాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘2.0’ కోసం రెహమాన్ ఐదు పాటలు రికార్డ్ చేసినప్పటికీ.. ఆ ఐదూ సినిమాలో ఉండవట. రెండు పాటలు మాత్రమే సినిమాలో ఉంటాయని.. మిగతావి ఆడియోకు మాత్రమే పరిమితమవుతాయని కోలీవుడ్ మీడియా చెబుతోంది.
ఐతే సినిమాలో ఉండే రెండు పాటలూ కళ్లు చెదిరే రీతిలో ఉంటాయని.. ముఖ్యంగా ఒక పాటను ఏకంగా రూ.32 కోట్లు పెట్టి తీశారని.. ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గ్రాండ్‌ సాంగ్ గా చరిత్రలో నిలిచిపోతుందని.. ఇంకో పాటను కూడా రిచ్ గా తీశారని.. ఈ రెండు పాటలతోనే కడుపు నిండిపోతుందని చెబుతున్నారు. సినిమా నిడివి చాలా ఎక్కువైపోవడం వల్ల పాటలకు మిగతా మూడు పాటల్ని పరిహరించి.. కథ మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని శంకర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి శంకర్ సినిమా అంటే పాటల కోసం ఆసక్తిగా చూసే ప్రేక్షకులు కేవలం రెండు పాటలతో సంతృప్తి చెందుతారా.. పాటల్లేకున్నా అసంతృప్తి లేనంత పకడ్బందీగా శంకర్ కథను నడిపించి ఉంటాడా.. చూద్దాం వచ్చే ఏడాది జనవరి 25న.
Tags:    

Similar News