ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు 'జోక‌ర్' ఎంద‌రికో స్ఫూర్తి

Update: 2022-12-11 14:30 GMT
ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు 'జోక‌ర్' ఫేం జోక్విన్ ఫీనిక్స్ న‌ట‌విన్యాసాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.  ప్ర‌పంచంలోనే అరుదైన‌ విల‌క్ష‌ణ న‌టుడిగా అత‌డి ప్రత్యేక‌తే వేరు! అని నిరూప‌ణ అయ్యింది. 2019-20 సీజ‌న్ లో ప‌లు విభాగాల్లో ఆస్కార్ లు కొల్ల‌గొట్టిన‌ 'జోకర్' మూవీలో అత‌డి అభిన‌యం ఒక సాహసోపేతమైన ప్ర‌ద‌ర్శ‌న‌గా క్రిటిక్స్ ప్ర‌శంసించారు. బాధ కలిగించే ఒక కళాఖండంలో ఆస్కార్ స్థాయికి త‌గ్గ విలువైన హృద్య‌మైన‌ న‌ట‌ప్రదర్శనతో హృద‌యాల‌ను గెలుచుకున్నాడు! అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

ముఖ్యంగా జోక‌ర్ టైటిల్ కి త‌గ్గట్టుగా ఈ సినిమా కథాంశం.. అందులో క‌థానాయ‌కుడి న‌ట‌న‌ను డిజైన్ చేసిన తీరుకు ప్ర‌పంచ‌వ్యాప్త సినీప్రియులు జేజేలు ప‌లికారు. ఒకేసారి బాధ‌ను అనుభ‌విస్తూ ఆనందాన్ని పంచుతూ న‌టుడిగా జీవిస్తూ జోక్విన్ ఫీనిక్స్ ముఖ క‌వ‌ళిక‌ల్లో ఎమోష‌న్ ని ప్ర‌ద‌ర్శించిన విధానం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నిజానికి అత‌డి న‌ట‌న‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎంద‌రో క‌ళాకారులు న‌టీన‌టులు ప్ర‌శంసించారు. అది అద్భుత క‌ళాఖండంలో అత్య‌ద్భుత న‌టుడి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌గా కీర్తించారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతోంది అన‌గానే అభిమానుల్లో ఒక‌టే కోలాహాలం క‌నిపిస్తోంది.

తాజాగా 'జోక‌ర్' చిత్ర నిర్మాత టాడ్ ఫిలిప్స్ సీక్వెల్ చిత్రం 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' నుండి జోక్విన్ ఫీనిక్స్ ఫస్ట్ లుక్ ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. ఈ చిత్రం 2019 బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'జోకర్' కి సీక్వెల్ అని వెల్ల‌డించారు. జోక‌ర్ చిత్రానికి ఉత్త‌మ న‌టుడు అవార్డ్ స‌హా ప‌లు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ద‌క్కాయి.  ఈ చిత్రంలో ఆర్థర్ ఫ్లెక్ గా జోక్విన్ నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ ద‌క్కింది.

నిర్మాత‌ టాడ్ ఇన్ స్టాలో సీక్వెల్ ఫ‌స్ట్ లుక్ ని షేర్ చేసారు. ''డే వ‌న్... మా అబ్బాయి. #జోకర్'' అన్న క్యాప్ష‌న్ తో పాటు  జైలులో ఉన్న ఆర్థర్ (క‌థానాయ‌కుడు) షేవ్ చేయించుకుంటున్నట్లు ఈ లుక్ ని ఆవిష్క‌రించారు. ఒక‌ అజ్ఞాత వ్యక్తి షేవింగ్ చేస్తూ క‌నిపించగా అర్థ‌ర్ చొక్కా లేకుండా పడి ఉన్నాడు. గతంలో కంటే సన్నగా నిర్జీవంగా ప‌డి క‌నిపిస్తున్నాడు. అతని ముఖం మీద షేవింగ్ ఫోమ్ క‌నిపిస్తోంది. సీక్వెల్ లుక్ ఫోటో విడుదల తర్వాత అభిమానులు క్లిక్ లు లైక్ ల‌తో హోరెత్తిస్తున్నారు. జోక్విన్ మ‌రో మాస్ట‌ర్ క్లాస్ ప్ర‌ద‌ర్శ‌న కోసం వేచి చూస్తున్నామ‌ని న‌టుడిగా అత‌డి స్ఫూర్తివంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను చూడాల‌నుకుంటున్నామ‌ని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాదు.. ఈ చిత్రంలో లేడీ గాగాను చూడాలని  చాలా మంది డిమాండ్ చేశారు. ఇందులో లేడీ గాగా హార్లే క్విన్ గా నటిస్తోంది. కానీ ఇంకా త‌న‌ లుక్ వెల్లడి కాలేదు. జోక్విన్ తో పాటు ''గాగా స్నీక్ పీక్'' కావాలి అంటూ ఒక అభిమాని కోరారు. ''మేం రెండ‌వ రోజున మీ అమ్మాయిని చూస్తామా?'' అంటూ మరొకరు అడిగారు. జోకర్ సీక్వెల్ లో అర్థ‌ర్ పాత్ర‌తో పాటు లేడీ గాగ పాత్ర‌కు గొప్ప‌ ప్రాధాన్య‌త ఉంద‌ని తెలుస్తోంది. అందుకే అభిమానులు జోక్విన్ తో పాటు గాగా ని చూడాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు.

జోక్విన్- టాడ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎవ‌రి ప‌నిలోకి వారు తిరిగి వచ్చారు. టాడ్ స్కాట్ సిల్వర్ తో కలిసి స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. బ్రెండన్ గ్లీసన్-  కేథరీన్ కీనర్ కూడా ఈ సీక్వెల్ లో తారాగణంగా చేరుతున్నారని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. Joker: Folie a Deux కోసం 'వార్నర్ బ్రదర్స్' స్టూడియోస్ ఇప్ప‌టికే రిలీజ్ తేదీని లాక్ చేసింది. 4 అక్టోబర్ 2024న ఈ  క్రేజీ సీక్వెల్ ని విడుదల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇటీవల పలు DC సినిమాల్లో హార్లే క్విన్ గా నటించిన మార్గోట్ రాబీ ఇప్ప‌టికే లేడీ గాగాకి తన దీవెనలు అందించింది. ''ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే హార్లే క్విన్ పాత్ర ఎంతో గొప్ప‌ది. మొదటి నుంచీ చెప్పాను... మక్ బెత్ లేదా బాట్ మాన్ వంటి పాత్ర‌లు ఎల్లప్పుడూ గొప్ప నటుడి నుండి ఇంకా గొప్ప నటునిగా మారే పాత్ర‌లు'' అని ఆమె MTV తో చాటింగ్ లో అన్నారు. హార్లే క్విన్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంద‌ని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News